తమిళనాడు మంత్రి అరెస్టు

సెంథిల్‌బాలాజీ అరెస్టులో నాటకీయ పరిణామాలు
– ఛాతిలో నొప్పితో ఆస్పత్రిలో చేరిన మంత్రి
– ఇది ప్రతీకార రాజకీయ చర్య ..ఫెడరల్‌ స్ఫూర్తిపై దాడి : సీఎం స్టాలిన్‌
– ఇలాంటి చర్యలకు భయపడం : కాంగ్రెస్‌
చెన్నై : మనీలాండరింగ్‌ కేసులో తమిళనాడు విద్యుత్‌ శాఖ మంత్రి, డీఎంకే నేత వి. సెంథిల్‌ బాలాజీ అరెస్టయ్యారు. మంత్రి కార్యాలయంలో మంగళవారం నుంచి సోదాలు జరిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు దాదాపు 18 గంటల పాటు విచారించారు. అనంతరం అర్ధరాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మంత్రి అరెస్టుతో తమిళనాడు రాజకీయాల్లో హీట్‌ పెరిగింది. డీఎంకే, కాంగ్రెస్‌, వాటి మిత్రపక్షాలు కేంద్రంలోని మోడీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.
సెంథిల్‌ బాలాజీ తన సహాయకులు సిఫారసు చేసిన అభ్యర్థులను నియమించేందుకు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌ అధికారులతో కలిసి కుట్ర పన్నారనే ఆరోపణలపై కేసు నమోదైంది. ఉద్యోగాల కోసం కోట్లాది రూపాయలు లంచం తీసుకున్నారని ఈడీ ఆరోపించింది. సెంథిల్‌ బాలాజీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో 2014 నుంచి 2015 మధ్య కాలంలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఆ సమయంలో ఆయన ఏఐఏడీఎంకే నాయకుడిగా ఉన్నారు. ఆ తర్వాత 2018లో ఆయన డీఎంకేలో చేరారు.
ఈనెల 13న ఈడీ రాష్ట్ర సెక్రెటేరియట్‌లోని సెంథిల్‌బాలాజీ ఛాంబర్‌లు, చెన్నైలోని ఆయన బంగ్లా, కరూర్‌, కోయంబత్తూర్‌ నగరాల్లో అతనికి సంబంధించిన ఇతర ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించింది. అయితే, బుధవారం తెల్లవారుజామున ఈడీ అధికారులు మంత్రిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆ సమయంలో ఆయన ఏడ్చినట్టు వీడియోలో కనబడింది.
మంత్రి అరెస్టు తర్వాత కరూర్‌ బస్టాండులో అధికారులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అయితే అరెస్టు తర్వాత ఛాతిలో అసౌకర్యంగా ఉన్నదని సెంథిల్‌బాలాజీ ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనను వైద్య పరీక్షల కోసం చెన్నైలోని మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అడ్మిట్‌ అయ్యారు. అనంతరం మంత్రికి కరోనరీ యాంజియోగ్రామ్‌ చేయించామనీ, అందులో ఆయన ట్రిపుల్‌ వెసెల్‌ డిసీజ్‌తో బాధపడుతున్నారని తేలిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయనకు వీలైనంత త్వరగా కరోనరీ ఆర్టరీ బైపాస్‌ గ్రాఫ్ట్‌ సర్జరీ చేయాలని సూచించినట్టు వెల్లడించాయి. కాగా ఆస్పత్రిలో చేరిన సెంథిల్‌బాలాజీని కలవడానికి ఉదయనిధి స్టాలిన్‌, ఎం సుబ్రమణియన్‌, ఈవీ వేలు, ఎస్‌ రేగుపతి సహా పలువురు తమిళనాడు మంత్రులు వెళ్లినా వారిని అనుమతించలేదని సమాచారం. సెంథిల్‌బాలాజీని తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్‌ పరామర్శించారు. బీజేపీపై ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్ర సచివాలయంలోని సెంథిల్‌బాలాజీ ఛాంబర్‌లో ఈడీ సోదాలు నిర్వహించటాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ సోదాలు ఫెడరలిజం స్ఫూర్తిపై దాడిగా ఆయన అభివర్ణించారు. బీజేపీ ప్రతీకార రాజకీయాల చర్యలను చూస్తున్న ప్రజల మౌనాన్ని తక్కువ అంచనా వేయకూడదన్నారు. 2024 జాతీయ ఎన్నికలు అనే తుఫానుకు ముందున్న ప్రశాంతత బీజేపీని తుడిచిపెట్టేస్తుందని హెచ్చరించారు.
ఆయుధంగా మారిన ఈడీ
‘సెంథిల్‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర సచివాలయంలో సోదాలు జరపడం దేనికి సంకేతం? ఎక్కడైనా సోదాలు చేయగలమనే బెదిరింపులకు ఇది సంకేతం కాదా? ప్రతిపక్ష నేతలపై దాడికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీి)ను మోడీ ప్రభుత్వం ఒక ఆయుధంగా మార్చుకుంది’
– సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి
సీబీఐకి నో ఎంట్రీ
– తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
చెన్నై: తమిళనాడులోని స్టాలిన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి తలుపులు మూసివేసింది. రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేందుకు గతంలో సీబీఐకి ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీంతో ఇకపై రాష్ట్రంలో ఏ కేసునైనా సీబీఐ దర్యాప్తు చేయాలంటే.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ఇదే తరహా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సెంథిల్‌ బాలాజీని మనీలాండరింగ్‌ కేసులో ఈడీ అరెస్టు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే డీఎంకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగ పరుస్తోందంటూ తీవ్రంగా ఆరోపిస్తూ ఇప్పటికే దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు సీబీఐకి జనరల్‌ కన్సెంట్‌ను ఉపసంహరించుకున్నాయి. ఆ జాబితాలో తెలంగాణ, పశ్చిమబెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, కేరళ, ఝార?ండ్‌, పంజాబ్‌, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలు ఉండగా.. తాజాగా తమిళనాడు చేరినట్లయింది.

Spread the love