– 2015 నుంచి ఈడీ కేసుల్లో వాదనలు
న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మేంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న నితీశ్ రానా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆదివారం మీడియాకు తెలిపారు. 2015 నుంచీ ఈడీ స్పెషల్ పీపీగా పనిచేస్తున్న ఆయన, దర్యాప్తు సంస్థ తరఫు న్యాయవాదిగా కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. రాజకీయంగా పెను సంచలనం సృష్టించిన పి.చిదంబరం, కాంగ్రెస్ నాయకుడు డి.కె.శివకుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులు, టీఎంసీ నాయకుడు అభిషేక్ బెనర్జీ, రాబర్ట్ వాద్రా..మొదలైనవారి ఈడీ కేసుల దర్యాప్తుల్లో కీలక పాత్ర పోషించారు. జమ్మూకాశ్మీర్ తీవ్రవాదుల నిధుల కేసులో లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌లపై ఈడీ ఆరోపణలు నమోదుచేయగా, ఈ కేసుల్లో ఆయన న్యాయవాదిగా ఈడీ తరఫున పనిచేశారు. అంతేగాక ఎయిర్ ఇండియా కుంభకోణం, విజరు మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోస్కీ, భూషన్ ఉక్కు, రాన్‌బాక్సీ రెలిగేర్ మోసం, ప.బెంగాల్‌లో పశువుల అక్రమ తరలింపు కేసుల్లోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ‘2020 న్యాయ ప్రముఖుల్లో అత్యంత శక్తివంతుడి’గా నితీశ్ రానాను ఫోర్బ్స్ మ్యాగజైన్ పేర్కొంది.