రాజ్యాంగ పరిరక్షణకు సంఘటితం కండి

– మోడీ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం
– మతోన్మాదులతో జాగ్రత్త…: సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలంతా సంఘటితం కావాలని సీపీ(ఎం) పోలిట్‌బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ పిలుపునిచ్చారు. మోడీ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయన్నారు. కొత్త రాజ్యాంగం పేరుతో మరో కొత్త డ్రామాకు మోడీషాలు తెరలేపుతున్నారని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల లోపు ప్రజల దృష్టిని మళ్లించి, ఓట్లు దండుకొనేందుకు మతోన్మాదశక్తులు కుట్రలు చేస్తాయనీ, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సీపీఐ(ఎం) హైదరాబాద్‌ సౌత్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారంనాడిక్కడి జంగమ్మెట్‌లో ‘రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు’ అంశంపై జరిగిన సదస్సులో ఆమె మాట్లాడారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాసిన భారత రాజ్యాంగాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ అప్పట్లోనే వ్యతిరేకించిందనీ, దాని స్థానంలో మనుస్మృతిని అమల్లోకి తేవాలని ప్రతిపాదించిందని వివరించారు. ఇప్పుడు దేశంలో ఆ మనుస్మృతి ఆధారంగానే దుస్సంఘటనలు జరుగుతున్నాయంటూ బిల్కిస్‌బానో కేసు సహా పలు అంశాలను ఆమె ఉదహరించారు. గడచిన తొమ్మిందేండ్లలో దేశంలో నిరుద్యోగం, ధరలు ఆకాశమంత ఎత్తు ఎదిగాయనీ, వాటిని నియంత్రించడంలో మోడీ సర్కారు ఘోరంగా విఫలమైందని విమర్శించారు. గతంలో ప్రభుత్వాలతో పోరాడితే, కనీసం ఆ సమస్యలు ఏంటో తెలుసుకొనే ప్రయత్నమన్నా చేసేవనీ, కానీ గడచిన 9 ఏండ్లలో ఏనాడు మోడీ సర్కారు ప్రజా ఆకాంక్షలతో కూడిన ఆందోళనల్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ప్రస్తుతం దేశంలో ఖాళీ గ్యాస్‌ సిలిండర్లపై కూర్చుని, కట్టెల పొయ్యిలో పొగ గొట్టాలను ఊదుకొనే పరిస్థితి కల్పించారని ఎద్దేవా చేశారు. అధికారం కోసం ప్రజల మధ్య అసమానతలు, ద్వేష భావాన్ని పెంచి పోషించే దుశ్చర్యలకు పాల్పడుతున్నారన్నారు. పేద, ధనిక తారతమ్యాన్ని పెంచి ఆర్థిక అసమానతలు పెచ్చరిల్లేలా పరిపాలన సాగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన మహిళా రెజ్లర్ల డిమాండ్లను పరిష్కరించడంలో మోడీ సర్కారు నిర్లక్ష్యంగా, నిర్దయగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిజ్‌భూషణ్‌ను ఎందుకు అరెస్టు చేయట్లేదని ప్రశ్నించారు. చట్టాలు పేదలు-పెద్దలపై భిన్నంగా పనిచేస్తున్నాయని విమర్శించారు. దేశం కోసం, ధర్మం కోసం అంటూ సెంటిమెంటును రాజేసి, ఓట్లు దండుకోవడానికి వచ్చే నేతలకు ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సీపీఎం హైదరాబాద్‌ సౌత్‌ జిల్లా కార్యదర్శి ఎమ్‌డీ అబ్బాస్‌ అధ్యక్షత వహించారు. చాంద్రాయణగుట్ట జోన్‌ కన్వీనర్‌ ఎల్‌ కోటయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎమ్‌ మీనా, జీ విఠల్‌, పీ నాగేశ్వర్‌, జిల్లా కమిటీ సభ్యులు ఎస్‌ కిషన్‌, ఎమ్‌డీ బాబర్‌ఖాన్‌, ఏ కృష్ణ, ఎమ్‌ బాలునాయక్‌, ఎమ్‌ శ్రవణ్‌కుమార్‌, ఎమ్‌డీ అబ్దుల్‌ సత్తార్‌, ఎమ్‌ లక్ష్మమ్మ, చాంద్రాయణ గుట్ట జోన్‌ కమిటీ సభ్యులు నూర్జహాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love