పర్సనల్‌ డేటా రక్షణ బిల్లుకు కేంద్రమంత్రివర్గం ఆమోదం

– పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ (డీపీడీపీ) బిల్లు 2023 ముసాయిదాకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్రమంత్రి వర్గ సమావేశమై ఆమోదించిన పర్సనల్‌ డేటా రక్షణ బిల్లుకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం ఈ బిల్లు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టబడుతుదని అధికారిక వర్గాలు తెలిపాయి. బిల్లులోని నిబంధనలను ఉల్లంఘించిన ప్రతి సందర్భంలోనూ సంస్థలపై రూ. 250 కోట్ల వరకు జరిమానా విధించాలని బిల్లు ప్రతిపాదించింది.ఈ బిల్లు సంప్రదింపుల కోసం ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన చివరి డ్రాఫ్ట్‌లోని దాదాపు అన్ని నిబంధనలను కలిగి ఉంది. ప్రతిపాదిత చట్టం ప్రకారం ప్రభుత్వ సంస్థలకు ఎటువంటి మినహాయింపు ఇవ్వలేదని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ”వివాదాల విషయంలో డేటా ప్రొటెక్షన్‌ బోర్డ్‌ నిర్ణయిస్తుంది. పౌరులు సివిల్‌ కోర్టును ఆశ్రయించడంతో నష్ట పరిహారాన్ని క్లెయిమ్‌ చేసే హక్కును కలిగి ఉంటారు” అని పేర్కొన్నాయి. చట్టం అమలు చేయబడిన తరువాత వ్యక్తులు వారి డేటా సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్‌ గురించి వివరాలను కోరుకునే హక్కును కలిగి ఉంటారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి.
ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సమావేశానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా నియమితులైన జి. కిషన్‌ రెడ్డి హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ చర్చలు మరింత ఊపందుకున్నాయి. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, భూపేందర్‌ యాదవ్‌, కిరెన్‌ రిజిజుతో సహా పలువురు కేంద్ర మంత్రులు.బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డాతో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి బిఎల్‌ సంతోష్‌ను కలవగా, మరో మంత్రి ఎస్‌పిఎస్‌ బాఘెల్‌ నడ్డాను కలిశారు. సమావేశాలలో ఏమి జరిగిందనే దానిపై అధికారిక సమాచారం లేదు. అయితే గత రెండు రోజులుగా ఎక్కువ మంది నాయకులు కేంద్ర నాయకులను కలిశారు.

Spread the love