– అభివృద్ధి క్రమంలో ఎవరూ వెనుకబడకుండా చూడాలి :
వారణాసిలో జి 20 సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని
న్యూఢిల్లీ : భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, కోవిడ్ మహమ్మారి ఈ రెండు ప్రపంచంలోని పేద దేశాల్లోని అభివృద్ధిని ప్రభావితం చేశాయని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. వారణాసిలో జి 20 దేశాల అభివృద్ధి మంత్రుల సమావేశాన్ని సోమవారం ప్రధాని ప్రారంభించారు. అంతర్జాతీయ అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు అందరినీ కలుపుకుని పోయే, న్యాయమైన ప్రయత్నాలను చేయాలని మోడీ పిలుపిచ్చారు. ”మహిళల నేతృత్వంలో” అభివృద్ధి నమూనాను భారత్ అనుసరిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి జై శంకర్ మాట్లాడుతూ, సరఫరా చైన్ల అంతరాయాలను ఎదుర్కొనాల్సిన అవసరం వుందని అన్నారు. ఉమ్మడి సవాళ్ళను ఎదుర్కొనడానికి అభివృద్ధి చెందిన దేశాలు అనుసరించే ‘లాభదాయకమైన వాటినే ఎంచుకోవడమనే’ పద్దతి సమర్ధవంతమైన మార్గం కాదని గుర్తు చేశారు. ”అభివృద్ధి అనేది ప్రపంచ పేద దేశాలకు కీలకమైన అంశం. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి కలిగించిన అంతరాయాలు, ఆటంకాలకు పేదదేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఆహార, ఇంధన, ఎరువుల సంక్షోభాలు తలెత్తడం మరో పెద్ద ఎదురు దెబ్బ. ఈ పరిస్థితుల్లో ఏ ఒక్కరూ కూడా వెనుకబడి పోకుండా చూడాల్సి వుంది.” అని ప్రధాని మోడీ వీడియో సందేశంలో పేర్కొన్నారు. సమావేశంలో ఈ వీడియోను ప్రదర్శించారు. ప్రస్తుతం జి 20కి అధ్యక్ష బాధ్యతలు వహిస్తున్న భారత్ వారణాసిలో జరిగే జి 20దేశాల మంత్రుల సమావేశానికి ఆతిధ్యం ఇస్తోంది. సరఫరా చైన్లలో అంతరాయాలపై దృష్టి, ఆహార, ఇంధన భద్రతా సవాళ్ళు, వాతావరణ మార్పులు, కోవిడ్ నుండి కోలుకోవడం వంటి అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ప్రధాని మోడీ సోమవారం నాటి తన ప్రసంగంలో ఉక్రెయిన్ సంక్షోభం గురించి స్పష్టంగా ప్రస్తావించలేదు. కానీ ఇప్పటివరకు భారత్ ఆతిథ్యమిచ్చిన జి-20 సంబంధిత కార్యక్రమాలన్నింటిలోనూ ఈ అంశం ప్రధానంగా ప్రస్ఫుటమవుతోంది.
డేటా డ్రైవ్ వల్ల ఎదురయ్యే సవాళ్ళను అధిగమించాల్సిందిగా జి 20దేశాలను మోడీ కోరారు. అభివృద్ధి లక్ష్యాల సాధనలో అత్యంత నాణ్యత కలిగిన డేటా చాలా కీలకమని వ్యాఖ్యానించారు. ప్రజలకు శక్తి సామర్ధ్యాలను కలిగించడానికి, డేటా అందరికీ అందుబాటులోకి రావడానికి, సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి సాంకేతికత అనేది ఒక సాధనంగా ఉపయోగపడుతుందని అన్నారు. భాగస్వామ్య దేశాలతో తన అనుభవాలు పంచుకోవడానికి భారత్ సుముఖంగా వుందన్నారు. మహిళలు అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశిస్తున్నారని అన్నారు. మహిళల నేతృత్వంలో అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికను జి 20 చేపట్టాలన కోరారు. ”భారతదేశంలో మహిళా సాధికారతకు మేం పరిమితం కాము, మాది మహిళల నేతృత్వంలో సాగే అభివృద్ధి క్రమం, అభివృద్ధికి మహిళలు ఎజెండాను రూపొందిస్తున్నారు. పైగా అభివృద్ధికి, మార్పుకు ఏజెంట్లుగా కూడా వారు వున్నారు.” అని మోడీ పేర్కొన్నారు. అనంతరం జై శంకర్ ప్రసంగించారు. ప్రపంచ దేశాల్లో అస్సలు అభివృద్ధి చెందని ప్రాంతాలకు అనుకూలంగా మాట్లాడారు. అత్యవసరంలో వున్న అటువంటి వారి గురించి అంతర్జాతీయ సమాజం ముక్త కంఠంతో మాట్లాడాలన్నారు. కోవిడ్‌కు ముందుగానే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల దిశగా పురోగతి మందగించిందని అన్నారు. తదనంతర కాలంలో తలెత్తిన కోవిడ్ మహమ్మారి ఈ పరిస్థితులను మరింత దుర్భరంగా తయారుచేసిందన్నారు. 2030నాటికల్లా సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకు గానూ 2016 జనవరి 1వ తేదిన 17 బృహత్తర సామాజిక, ఆర్థిక లక్ష్యాలను ఆమోదించారు. వాటినే ఎస్‌డిజి (సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు)గా పేర్కొంటారు.