హర్యానాలో అన్నదాతల ఆందోళన..

– కురుక్షేత్ర-ఢిల్లీ జాతీయ రహదారి దిగ్బంధం
అమృత్‌సర్‌: హర్యానాలో రైతులు ఆందోళన తీవ్రరూపం దాల్చింది.ఈ క్రమంలో జాతీయ రహదారి-44 ను రైతులు దిగ్బంధించారు. పొద్దు తిరుగుడు పంటకు మద్ధతు ధర ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ నిరసనకు దిగారు.ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న రైతులకు యూపీ, పంజాబ్‌ రైతులు మద్దతు తెలిపారు. అదేవిధంగా రైతులకు రెజ్లర్లు సైతం మద్దతు తెలిపారు. రైతులు మంగళవారం హర్యానాలోని కురుక్షేత్ర వద్ద ఢిల్లీ-అమత్‌సర్‌ జాతీయ రహదారిని(ఎన్‌హెచ్‌ 44) దిగ్బంధం చేశారు. పొద్దు తిరుగుడు పువ్వు గింజలకు కనీస మద్దతు ధర ఇవ్వకూడదని హర్యానా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. రైతులు జాతీయ రహదారిని దిగ్బంధం చేయడంతో ఢిల్లీ-అమత్‌సర్‌ జాతీయ రహదారి మీద ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. పొద్దుతిరుగుడు విత్తనాలకు మద్ధతు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ రైతులు జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. కురుక్షేత్ర జిల్లాలోని పిప్లి సమీపంలోని ఫ్లై ఓవర్‌పై వారు గుమిగూడారు. మహాపంచాయత్‌లో భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేష్‌ టికాయత్‌తో సహా కీలక రైతు నాయకులతో పాటు, రెజ్లర్‌ బజరంగ్‌ పునియా కూడా ఉన్నారు. రెజ్లర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్న అగ్రశ్రేణి గ్రాప్లర్‌లలో అతను ఒకడు. రాష్ట్ర ప్రభుత్వం పొద్దుతిరుగుడు విత్తనాలను మద్దతు ధరకు కొనుగోలు చేయడం లేదని, తమ ఉత్పత్తులను క్వింటాల్‌కు రూ. 6,400 ఎంఎస్‌పీకి రూ. 4,000 చొప్పున ప్రయివేట్‌ కొనుగోలుదారులకు విక్రయించాల్సి వచ్చిందని నిరసన వ్యక్తం చేసిన రైతులు పేర్కొన్నారు. పొద్దుతిరుగుడు విత్తనాలను క్వింటాల్‌కు రూ.6,400 ఎంఎస్‌పీతో ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Spread the love