ఉత్తరప్రదేశ్‌లో తుపాకీ రాజ్‌ కోర్టు వెలుపులే కాల్పులు

– గ్యాంగ్‌స్టర్‌ మృతి
– ఇద్దరికి గాయాలు
– మృతుడు బీజేపీ నాయకుల హత్య కేసులో నిందితుడు
– వరుస ఘటనలపై సర్వత్రా ఆందోళన
లక్నో : యోగి అదిత్యనాథ్‌ పాలనలో ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు రోజుకు క్షీణిస్తున్నాయి. ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. న్యాయం జరగాల్సిన కోర్టు ఆవరణలోనే తుపాకీలతో సాయుధ దుండగులు విరుచుకుపడుతున్నారు. తాజాగా బుధవారం లక్నో కోర్టు ఆవరణలో పట్టపగలే అందరూ చూస్తుండగానే జరిగిన కాల్పుల్లో ఒక గ్యాంగ్‌స్టర్‌ హతమవ్వగా.. ఒక కానిస్టేబుల్‌, రెండున్నర ఏండ్ల బాలిక గాయపడ్డారు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. కేసు విచారణ నిమిత్తం గ్యాంగ్‌స్టర్‌ సంజీవ్‌ మహేశ్వరి జీవాను కోర్టుకు తీసుకుని వచ్చారు. లాయర్‌ దుస్తుల్లో వచ్చిన వ్యక్తి ఈ కాల్పులకు తెగబడ్డాడు. మృతి చెందిన గ్యాంగ్‌స్టర్‌ ఇద్దరు బీజేపీ నాయకుల హత్య కేసులో నిందితుడుగా ఉన్నాడు. సంజీవ్‌పై మొత్తం 24 కేసులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. గ్యాంగ్‌స్టర్‌, రాజకీయనాయకుడు ముక్తర్‌ అన్సారీకి అత్యంత సన్నిహితుడుగా సంజీవ్‌ మహేశ్వరి జీవా గుర్తింపు పొందాడు. బీజేపీ మంత్రి బ్రహ్మదత్‌ ద్వివేది హత్య కేసులో ముక్తర్‌ అన్సారీ నిందితుడుగా ఉండగా, సహ నిందితుడుగా సంజీవ్‌ ఉన్నాడు. 1997 ఫిబ్రవరి 10న జరిగిన ఈ హత్య కేసులో ఒక ట్రయిల్‌ కోర్టు సంజీవ్‌ను దోషిగా నిర్థారించింది. 2003 జులై 17న జీవిత ఖైదు కూడా విధించింది. అలాగే మరో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణాంద్‌ రారు హత్య కేసులోనూ సంజీవ్‌ నిందితుడుగా ఉన్నాడు.
కొన్ని రోజులుగా లక్నో జైలులో శిక్ష అనుభవిస్తున్న సంజీవ్‌ జీవాను బుధవారం ఒక కేసు విచారణ నిమిత్తం లక్నో సివిల్‌ కోర్టుకు తీసుకుని వచ్చారు. కోర్టు ఆవరణలోనే లాయర్‌ వేషంలో వచ్చిన దుండగుడు కాల్పులు జరిపాడు. సమీపం నుంచి అనేక రౌండ్లు కాల్పులు జరపడంతో సంజీవ్‌ మృతి చెందాడు. ఒక కానిస్టేబుల్‌, రెండున్నర ఏళ్ల బాలిక గాయపడ్డారు. వీరిని ట్రామా సెంటర్‌కు తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉంది. కాల్పుల జరిపిన వ్యక్తి పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కాల్పుల ఘటనపై ఆగ్రహం చెందిన లాయర్లు నిరసనకు దిగారు. పోలీసులపైకి రాళ్ల దాడికి కూడా పాల్పడ్డారు. కోర్టు ఆవరణలో భద్రత పెంచాలని డిమాండ్‌ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్నాయి. ఇటీవలే పోలీసు కస్టడీలో ఉన్న అతిక్‌ అహ్మద్‌ను దుండగులు కాల్చి చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వరుస ఘటనలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
బుధవారం ఘటనపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో విమర్శలకు దిగాయి. భద్రత ఎక్కువగా ఉండాల్సిన చోటే హత్యలు జరగడం ఆందోళనకరమని ఎస్‌పి పార్టీ అధ్యక్షులు అఖిలేష్‌ యాదవ్‌ విమర్శించారు.

Spread the love