12న పెద్దఎత్తున నిరసనలు

యూపీ పొటాటో రైతులు
లక్నో : కోల్డ్‌స్టోరేజీ యజమానుల ధరల పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా యూపీ బంగాళదుంప రైతుల ఆందోళన కొనసాగుతున్నది. ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ.. భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ), ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) బ్యానర్‌ కింద గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కాదనీ, కోల్డ్‌ స్టోరేజీ యజమానులు ఏకపక్షంగా, అన్యాయంగా ధరలను పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కిసాన్‌ సంఘర్ష్‌ సమితి కింద కన్నౌజ్‌ కలెక్టరేట్‌ వరకు బుధవారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కోల్డ్‌స్టోరేజీ యజమానులకు, జిల్లా ఉద్యానవన విభాగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని రైతు నేత గీతేంద్ర సింగ్‌ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. కోల్డ్‌స్టోరేజీ యజమానులు ధరలను నియంత్రించకుంటే ఈ నెల 12న లక్నోలో పెద్ద ఎత్తున ఆందోళనను చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం 2023-24లో స్టోరేజీ కోసం సాదా బంగాళాదుంపలకు క్వింటాకు రూ.230, షుగర్‌ ఫ్రీ బంగాళాదుంప క్వింటాకు రూ.260గా నిర్ణయించింది. కానీ కోల్డ్‌ స్టోరేజీ యజమానులు క్వింటాకి అదనంగా రూ.60 వసూలు చేస్తున్నారనీ, దీంతో రైతులు తమ ఉత్పత్తులను విక్రయించినా హెక్టారుకు రూ. 17,000 నుంచి రూ. 19,000 వరకు నష్టపోతున్నారని రైతు సంఘాలు పేర్కొన్నాయి.
ఈ ఏడాది బంగాళదుంప సాగు అధికంగా ఉందనీ, దీంతో కోల్డ్‌స్టోరేజీ యజమానులు ఇష్టారీతిన ధరలను పెంచేశారని కన్నౌజ్‌ జిల్లా బీకేయూ అధ్యక్షుడు షామిమ్‌ అహ్మద్‌ తెలిపారు. ధరల పెంపుతో రైతులపై అదనపు భారం పడుతున్నదని అన్నారు. కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణానికి ప్రభుత్వం 30శాతం నుంచి 40 శాతం వరకు సబ్సిడీ అందిస్తోందని, కానీ ఇవి రైతులకు లబ్థి చేకూర్చడం లేదని ఆగ్రాకు చెందిన మరో రైతు నేత శ్యామ్‌ సింగ్‌ చాహర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మొత్తం బంగాళా దుంప ఉత్పత్తిలో 35 శాతం వాటా యూపీ నుండే వస్తుంది.

Spread the love