యూపీలో దారుణం

– దళిత బాలుడిపై అమానవీయ చర్య
– తీవ్రంగా కొట్టి.. మలాన్ని చేతితో
– తొలగించాలంటూ బలవంతం
– కేసు నమోదు చేసిన పోలీసులు
లక్నో : బీజేపీ పాలిత యూపీలో దళితులపై పెత్తందార్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. యోగి పాలనలో మహిళలతో పాటు దళితులకు రక్షణ ఉండటం లేదు. ఏదో ఒక విధంగా వారిపై దాడులు నిత్యకృత్యమవుతున్నాయి. తాజాగా ఒక దళిత బాలుడిపై దాడి జరిగింది. అంతే కాకుండా మలాన్ని చేతితో తీయాలంటూ ఆ బాలుడిని నిందితుడు బలవంతం చేయటం గమనార్హం. ఎటవా జిల్లా సైఫైలో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై దళిత సంఘాల నాయకులు, సామాజిక, ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలకు వారు డిమాండ్‌ చేశారు.
పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు (15) 11వ తరగతి చదువుతున్నాడు. అయితే, ఉదయం జగ్రామ్‌ యాదవ్‌ వ్యవసాయ భూమిలో బహిర్భూమికి వెళ్లాడు. అయితే, ఇది గమనించిన జగ్రామ్‌ యాదవ్‌.. బాలుడిపై ఆగ్రహంతో ఊగిపోయాడు. బాలుడిని తీవ్రంగా కొట్టాడు. బాలుడి చేతితోనే అతని(బాలుడి) మలాన్ని తీసివేయించాడు. జిల్లాలోని ప్రసన్న పంచాయతీలో ఈనెల 13న ఈ ఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనపై బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జగ్రామ్‌ యాదవ్‌.. ఘటనకు దగ్గర పొలాల్లో పని చేస్తున్న తమ బంధువు ఈ దాడిని ఆపేందుకు యత్నించినందుకు ఆమెపై కూడా దాడికి పాల్పడ్డాడని బాలుడి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద నిందితుడిపై కేసు నమోదు చేసినట్టు జిల్లా పోలీసు అధికారి తెలిపారు. జగ్రామ్‌ యాదవ్‌ పరారీలో ఉన్నాడనీ, అతనిని అరెస్టు చేయడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారని చెప్పారు. అయితే, జగ్రామ్‌ యాదవ్‌.. కోర్టులో సరెండర్‌ అప్లికేషన్‌ను దాఖలు చేయటం గమనార్హం.

Spread the love