అవినీతికి నిలయంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం..

– లంచం ఇవ్వనిదే కదలని డాక్యుమెంట్స్‌
– అన్ని సక్రమంగా ఉన్నా ఏవో కొర్రీలు
– భూమికో రేట్‌.. ఇండ్ల రిజిస్ట్రేషన్లకు మరో రేటు
– అక్రమ రిజిస్ట్రేషన్లతో లక్షలు గడించిన గంగాధర ఇన్‌చార్జి ఎస్‌ఆర్‌వో
నవతెలంగాణ – గంగాధర
ఆ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. రిజిస్ట్రేషన్లు చేయడానికి అన్ని కాగితాలు సక్రమంగా ఉన్నా అమ్యామ్యాల కోసం ఏవేవో కొర్రీలు పెట్టడం ఈ శాఖ అధికారికి వెన్నతో పెట్టిన విద్యే. లంచం ఇవ్వనిదే ఏ డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌ వరకు వెళ్లపోగా, భూమి రిజిస్ట్రేషన్‌ చేస్తే ఓ రేటు, ఇండ్లు రిజిస్ట్రేషన్‌ చేస్తే మరో రేటును లంచంగా వసూలు చేస్తూ నెలరోజుల వ్యవధిలోనే ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ లక్షలు గడించాడనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన గంగాధర సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం తీరు, ఏసీబీకి చిక్కిన జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం సీనియర్‌ అసిస్టెంట్‌, ఇన్‌చార్జి ఎస్‌ఆర్‌వో శివారపు సురేశ్‌బాబు అవినీతి వ్యవహారం ఇది. వివరాల్లోకి వెళితే… గంగాధర మండల కేంద్రంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలో గంగాధర, రామడుగు, చొప్పదండి, కొత్తపల్లి మండలాలు, ఆయా మండలాల్లోని గ్రామాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్స్‌ను తయారు చేయడానికి గంగాధర రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ను ఆనుకుని 30మంది డాక్యుమెంట్‌ రైటర్లు ఉండగా, కరీంనగర్‌ నుండి డాక్యుమెంట్స్‌ తయారు చేసుకుని ఇక్కడ రిజిస్ట్రేషన్లు చేయించడానికి వచ్చే రైటర్లు మరో 30మంది ఉన్నారు. ఇండ్లు, భవనాలు, భూముల రిజిస్ట్రేషన్‌ను అనుసరించి క్రయ, విక్రయదారుల నుండి నేరుగా ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ శివారపు సురేశ్‌బాబు డబ్బులు వసూలు చేయకుండా డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారే వసూళ్ల దందాకు తెర లేపినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం ఇలా ఉంటే, అక్రమ రిజిస్ట్రేషన్లు, తప్పుడు డాక్యుమెంట్స్‌, రియల్‌ ఎస్టేట్‌ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల కూడా ఇక్కడి సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో జరిగినట్టు ఓ కేసులో పోలీసుల విచారణలో బయట పడ్డాయి. కొత్తపల్లి మండలం రేకుర్తిలో భూములు కోర్టు కేసుల్లో ఉన్నాయి. అయితే ఇటువంటి భూములను రిజిస్ట్రేషన్‌ చేయడానికి లక్షల్లో వసూళ్లు చేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్టు ఆరోపణలు గుప్పుమంటుంటే, తప్పుడు పత్రాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్టు గుర్తించిన కరీంనగర్‌ పోలీసులు ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు ఇటీవలే పలువురిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. ఇలా ఒకటో, రెండో కాకుండా వందల డాక్యుమెంట్స్‌ తప్పుడు పత్రాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసి ఏసీబీకి చిక్కిన ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ సురేశ్‌బాబు లక్షలు సొమ్ము చేసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
లీవ్‌లో పర్మినెంట్‌ రిజిస్ట్రార్‌.. షురూ అయిన అవినీతి దందా
గంగాధర పర్మినెంట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న పద్మ నెల రోజులు లీవ్‌ పెట్టి వెళ్లగా, కరీంనగర్‌ జిల్లా రిజిస్ట్రార్‌ ఆఫీసులో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసే శివారపు సురేశ్‌ బాబు ఇక్కడ ఇన్‌చార్జి ఎస్‌ఆర్‌వో బాధ్యతలు చేపట్టారు. అయితే పర్మినెంట్‌ రిజిస్ట్రార్‌గా ఉన్న పద్మ నిక్కచ్చిగా వ్యవహరిస్తూ అన్ని డాక్యుమెంట్స్‌ సక్రమంగా ఉంటేనే రిజిస్ట్రేషన్లు చేస్తదనే మంచి పేరుంది. అయితే ఉన్న పర్మినెంట్‌ ఎస్‌ఆర్‌వోతో తప్పుడు రిజిస్ట్రేషన్లు జరగడం లేదని గ్రహించిన కొందరు భూ ఆక్రమణదారులు ఇన్‌చార్జి ఎస్‌ఆర్‌వోగా సురేశ్‌బాబును ఇక్కడికి తెచ్చుకుని తమ అక్రమ రిజిస్ట్రేషన్ల దందాను నిరాటంకంగా కొనసాగించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే పొద్దంతా డాక్యుమెంట్‌ సక్రమంగా ఉన్న ఇండ్లు, భవనాలు, భూములు రిజిస్ట్రేషన్లు చేయగా, సాయంత్రం అక్రమ రిజిస్ట్రేషన్ల దందాను కొనసాగించినట్టు తెలుస్తుంది.
కాసులు కురిపిస్తున్న రేకుర్తి భూములు
ఒకప్పుడు కరీంనగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలో ఉన్న కొత్తపల్లి, రేకుర్తి, చింతకుంట, కరీంనగర్‌ పట్టణంలోని పలు ఏరియాలు గంగాధర సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధికి చేరాయి. దీంతో పట్టణంలోని ఇండ్లు, భవనాలు, భూములకు లక్షలు, కోట్ల విలువ పలకడంతో అక్రమ లే ఆవుట్లు, కోర్టు కేసుల భూములు, అక్రమ రిజిస్ట్రేషన్లు పెరిగాయి. ఇదే అదునుగా భావించే భూ బకాసురులు, అక్రమ రియల్‌ వ్యాపారులు ఇళ్లు, భవనాలు, భూముల క్రయ, విక్రయాల ద్వారా లక్షలు గడిస్తూ రిజిస్ట్రేషన్లు చేయిస్తూ ఇక్కడి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని అవినీతి రిజిస్ట్రేషన్ల దందాకు కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చారు. కొంతకాలంగా రేకుర్తి పరిసరాల్లోని భూములు కోర్టు కేసుల్లో చిక్కాయి. అయితే వీటిని రిజిస్ట్రేషన్‌ చేయడానికి వీలు లేదు. కాని ఏదో ఓ రకంగా అక్రమ రిజిస్ట్రేషన్లతో ఇక్కడి భూములు క్రయ, విక్రయాలు చేస్తుండడంతో ఓ వైపు రియల్‌ వ్యాపారులకు, మరో వైపు సబ్‌ రిజిస్ట్రార్‌, ఆ శాఖ సిబ్బందికి కాసులు కురుస్తున్నారు.
ఇండ్ల్లకో రేటు.. భూములకో రేటు..
పత్రాలు అన్నీ సక్రమంగా ఉండి ఇండ్లు, భవనాలు ఏ రకంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నా ఒక్కో డాక్యుమెంట్‌కు రూ.600 నుండి 1000, భూముల రిజిస్ట్రేషన్‌కు రూ.1200 నుండి 2వేల చొప్పున ఇక్కడి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వసూళ్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. అన్నీ సక్రమంగా ఉన్నా డాక్యుమెంట్స్‌కు వేరు వేరు రేట్లు నిర్ణయించుకున్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎస్‌ఆర్‌వో, సిబ్బంది, ఏవైనా డాక్యుమెంట్స్‌లో తప్పులు ఉంటే వేలల్లో డబ్బు వసూలు చేస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అవినీతి దందాకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన గంగాధర సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చి డాక్యుమెంట్స్‌ పనులు చక్కబెట్టే డాక్‌మెంట్‌ రైటర్లు ఇదే అదునుగా అందినంత దండుకుంటున్నారని క్రయ, విక్రయదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

– గంగాధర సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుపై ఏసీబీ దాడి
– రూ.10వేలు లంచం తీసుకుంటూ
– పట్టుబడిన ఇన్‌చార్జి ఎస్‌ఆర్‌ఓ
నవతెలంగాణ – గంగాధర
లంచం తీసుకుంటూ ఓ అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. డబ్బులు ఇవ్వనిదే ఏ పని చేయని ఇంచార్జీ రిజిస్ట్రార్‌ గిప్టు డీడీ రిజిస్ట్రేషన్‌ చేయడానికి రూ.10వేలు డిమాండ్‌ చేసి తన సబార్డి నేట్‌ ద్వారా డబ్బులు తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెంది న కొక్కుల రాజేశం కొత్తపల్లి మండ లం రేకుర్తిలోని సర్వే నంబర్‌ 131లో 486.42 చదరపు గజాల భూమిని తన కుమారుడు కొక్కుల అజరుకుమార్‌ పేరిట గిప్టు డీడీ రిజిస్ట్రేషన్‌ చేయడానికి గంగాధర ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ సురేశ్‌బాబు రూ.10వేలు డిమాండ్‌ చేశారు. దీంతో స్థానిక డాక్‌మెంట్‌ రైటర్‌ ఆకుల అంజయ్య ద్వారా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో వలపన్నిన ఏసీబీ అధికారులు రూ.10 వేలను డాక్యుమెంట్‌ రైటర్‌ ఆకుల అంజయ్యతో ఆఫీస్‌ సబార్డి నేట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి కొత్తకొండ శ్రీధర్‌ ద్వారా ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ సురేశ్‌బాబుకు ఇప్పించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇద్దరిపై కేసు నమోదు చేశామని, తగిన ఆధారాలతో ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వివరించారు. అయితే ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి కొత్తకొండ శ్రీధర్‌ను లంచంగా ఇచ్చే డబ్బులు తీసు కొమ్మని చెప్పి ఏసీబీ కేసులో ఇరికించడం చర్చానీయాంశంగా మారింది. ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐ తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.
ఇన్‌చార్జి ఎస్‌ఆర్‌వో సురేశ్‌బాబు ఇంట్లో ఏసీబీ సోదాలు
భారీగా లభించిన బంగారు ఆభరణాలు, నగదు
గంగాధర మండల కేంద్రంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఇంచార్జీ ఎస్‌ఆర్‌వోగా పని చేస్తూ ఏసీబీకి పట్టుబడిన శివారపు సురేశ్‌బాబు ఇంట్లో ఏసీబీ అధికారులు శనివారం రాత్రి సోదాలు చేపట్టారు. కరీంనగర్‌లోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు చేపట్టిన సోదాల్లో రూ.12.3 లక్షల నగదు, పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు లభించినట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఏసీబీ అధికారులు ఆయన ఇంట్లో చేపట్టిన సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

Spread the love