వామపక్ష లౌకిక శక్తులను గెలిపించాలి

వామపక్ష లౌకిక శక్తులను గెలిపించాలి– పూలే, అంబేద్కర్‌ స్ఫూర్తితో సామాజికోద్యమాలు : పూలే అంబేద్కర్‌ జన జాతర సదస్సులో వక్తలు
నవతెలంగాణ-జనగామ
దళిత, గిరిజన, బలహీనవర్గాలకు రాజ్యాంగబద్ధంగా కల్పించబడిన హక్కులను కాలరాస్తున్న మతోన్మాద బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించాలని వక్తలు అన్నారు. పూలే, అంబేద్కర్‌ స్ఫూర్తితో సామాజిక ఉద్యమాలను బలోపేతం చేయాలని చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ ఎంవి రమణ, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌ బాబు, ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అబ్బాస్‌ పిలుపునిచ్చారు. శనివారం జనగామ జిల్లా కేంద్రంలోని గాయత్రి గార్డెన్‌లో సామాజిక సంఘాల ఆధ్వర్యంలో పూలే, అంబేద్కర్‌ జనజాతర జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్లమెంట్‌ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించడమే సామాజిక శక్తుల కర్తవ్యమన్నారు. మనుస్మృతి వారసురాలు బీజేపీని ఓడించడం ద్వారా రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో దేశాన్ని అట్టడుగుకు చేర్చిన బీజేపీ విధానాలు.. దేశ సమైక్యతకు విఘాతం కలిగిస్తాయని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం ద్వారా రిజర్వేషన్లు లేకుండా చేయాలని యోచిస్తుందని, తద్వారా సామాజిక న్యాయాన్ని సమాధి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా రాజ్యాంగానికి ప్రమాదగంటికలు మోగుతాయని, మనుస్మృతి చాందస భావాలను దేశంలో పెంచి పోషిస్తూ రాజ్యాంగ రద్దుకు కుట్ర చేస్తుందని చెప్పారు. బీజేపీ 400 సీట్లు సాధిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని కర్ణాటక బీజేపీ చెప్పడాన్ని సామాజిక శక్తులు గుర్తుపెట్టుకోవాలన్నారు.
విద్యా, ఉపాధి, వైద్యం వంటి ప్రజల మౌలిక అవసరాలను వదిలేసి.. మత ఉద్రిక్తతలు, అభద్రతల చుట్టూ దేశాన్ని నడిపిస్తుందన్నారు. బీసీ ప్రధాని అని చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ బీసీ కుల గణన ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. పేదల నిలువ నీడ కోసం గుడిసెలు వేసుకుంటే తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆ పేదలందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సదస్సుకు కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి బొట్ల శేఖర్‌, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బి.వెంకటమల్లయ్య, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి అజ్మీర సురేష్‌ నాయక్‌, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి ఎదునూరి మదార్‌ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్‌, ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు సాంబరాజు యాదగిరి, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు, ఐద్వా జిల్లా కార్యదర్శి ఇర్రి అహల్య, కేవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల లలిత, సీఐటీయూ, సామాజిక సంఘాల, వృత్తి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Spread the love