ఇండియా ఎప్పటికీ సెక్యులర్‌ దేశమే..

ఇండియా ఎప్పటికీ సెక్యులర్‌ దేశమే..– మీడియా అకాడమీ చైర్మెన్‌ కె.శ్రీనివాస్‌ రెడ్డి
నవతెలంగాణ-బంజారాహిల్స్‌
భారత రాజ్యాంగం ముందు మత రాజకీయాల మనుగడ అసాధ్యమని, ఈ దేశం ఎప్పుడూ సెక్యులర్‌ దేశమేనని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈద్‌ మిలాప్‌ సందర్భంగా శనివారం హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియం న్యూస్‌ పేపర్స్‌, మేనేజ్‌మెంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు యూసుఫ్‌ బాబు అధ్యక్షతన ‘ఎన్నికలు- లౌకికవాదం’ అనే అంశంపై చర్చాకార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కె.శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మనుధర్మశాస్త్ర వ్యాప్తికి కొందరు ప్రయత్నించి విఫలమయ్యారన్నారు. నేడూ కొందరు నాయకులు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మతపరమైన రాజకీయాలు భారతదేశంలో ఎక్కువ రోజులు మనుగడ సాగించలేవని చెప్పారు. మతం ఆధారంగా నడిచే దేశాలు అధోగతి పాలయ్యాయని తెలిపారు. భారతదేశం పూర్తిగా లౌకికవాద దేశమని, ఇక్కడ అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి జీవిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌పీఎస్‌సీ మాజీ చైర్మెన్‌ ఘంటా చక్రపాణి, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

Spread the love