– ఎలక్డోరల్ బాండ్లు…బీజేపీ విధానాలకు తార్కాణం:కె.వేణుగోపాల్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎలక్టోరల్ బాండ్లు బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు తార్కాణమని 10 టీవీ మాజీ ఎండీ కె.వేణుగోపాల్ విమర్శించారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అవినీతిని చట్టబద్ధం చేసిన బీజేపీకి సీపీఐ(ఎం), ఇతరులు చేసిన న్యాయపోరాటంతో చెక్ పడిందని తెలిపారు. నవతెలంగాణ హెచ్‌ఆర్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఎమ్‌హెచ్ భవన్‌లో ఎన్నికల బాండ్లు- సుప్రీంకోర్టు తీర్పు-పరిణామాలు అనే అంశంపై నిర్వహించిన స్టడీ సర్కిల్‌కు పత్రికా సంపాదకులు ఆర్.సుధాభాస్కర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ ఎలక్టోబర్ బాండ్లను రాజకీయ పార్టీలు తీసుకునేందుకు బీజేపీ చేపట్టిన సవరణల క్రమం పరిశీలిస్తే, ఆ పార్టీ ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తుందో అర్థమవుతుందని విమర్శించారు. ప్రజాప్రతినిధుల ప్రాతనిథ్య చట్టం, ఐటీ చట్టానికి సవరణలు చేసి, సమాచార హక్కు చట్టం ద్వారా కూడా తెలుసుకునేందుకు వీలు లేకుండా ఎలక్టోరల్ బాండ్లను రాజకీయ పార్టీలు తీసుకునే అవకాశం కల్పించందని తెలిపారు. దీంతో ఈ బాండ్ల రూపంలో డబ్బ్నుల ఎవరు ఇస్తున్నారు? ఎవరికి ఇస్తున్నారు? ఏ ప్రయోజనాన్ని ఆశించి ఇస్తున్నారు? తదితర విషయాలను ప్రజలు తెలుసుకునే అవకాశం లేకుండా పోయిందని వివరించారు. 2017లో ఫైనాన్స్ బిల్లును ప్రవేశపెట్టే సమయంలో అనుమతించిన తర్వాత, ఇటీవల సుప్రీంకోర్టు వాటిని రద్దు చేసేంత వరకు వివిధ కంపెనీలు, వ్యక్తిగత హౌదాలో రాజకీయ పార్టీలకు రూ.16,500 కోట్ల వరకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అందాయని తెలిపారు. వీటిలో 54 శాతమంటే దాదాపు రూ.8 వేల కోట్లకుపైగా బీజేపీకే ముట్టాయని చెప్పారు. ఆ పార్టీకి డబ్బులు ఇచ్చిన కంపెనీలు ఏదో ఒక రూపంలో ప్రభుత్వం నుంచి ప్రయోజనాన్ని పొందాయని చెప్పారు. మరి కొంత మంది ఈడీ, ఐటీ దాడుల తర్వాత బాండ్లు ఇచ్చారంటే ఎందుకిచ్చారో అర్థం చేసుకోవాలని సూచించారు. అవినీతిని చట్టబద్ధం చేసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నానికి సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా ఇచ్చిన తీర్పు చెంపపెట్టులాంటిదని తెలిపారు. బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీ అంటే అవినీతి మచ్చలేదంటూ ప్రచారం చేస్తున్న కమలం నేతలు ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఏం చెబుతారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిన కంపెనీలు, కార్పొరేట్లు, వ్యక్తులకు అనుకూలంగా విధానాలు అమలు చేసిందని చెప్పారు. అందుకే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులకు వచ్చే నిధుల గురించి తెలుసుకునే ప్రజలకున్న హక్కును కూడా హరించివేసేందుకు ప్రయత్నించిందని చెప్పారు. బీజేపీ చేసిన ఈ అవినీతిని ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు.