నిరాశ‌లో నిరుద్యోగి

Desperately unemployed– యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తక్కువే
– కేంద్రంలోని మోడీ సర్కారుపై యువత ఆగ్రహం
– లోక్‌సభ ఎన్నికల్లో ఇది కాషాయపార్టీకి పెద్ద దెబ్బే
– విశ్లేషకులు, మేధావుల అంచనా
మోడీ పరిపాలనే ఈ సమస్యకు కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ”మోడీ సర్కారు దయనీయమైన ఉదాసీనతతో మన యువత తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. భారత్‌లో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నదని పలు నివేదికలు చెప్తున్నాయి” అని ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఆరోపించారు.
న్యూఢిల్లీ : మోడీ పదేండ్ల పాలనలో నిరుద్యోగం తీవ్రమైంది. యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 2014 ఎన్నికలకు ముందు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల కల్పన అనే హామీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ.. తన ప్రభుత్వంలో దానిని మాత్రం నిలబెట్టుకోలేకపోయాడు. ఈ విషయంలో యువతలో మోడీపై ఇప్పటికీ ఆగ్రహమే ఉన్నది. అయితే, ప్రతి ఎన్నికలకు ముందు హిందూత్వం, జాతీయ భావం, పాక్‌-చైనా.. ఇలా పలు భావోద్వేగ అంశాలను ముందుకు తీసుకొచ్చి యువతను రెచ్చగొట్టి మోడీ ప్రభుత్వం రాజకీయంగా లబ్ది పొందుతున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
దేశంలో కోట్లాది మంది యువత ఇప్పటికీ తీవ్ర నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నది. చాలా మందికి వారు చదువుకు తగిన ఉద్యోగాలు దక్కటం లేదు. మరికొందరైతే, ఉన్నత విద్యనభ్యసించినా కూడా తక్కువ స్థాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ పడుతుండటం గమనార్హం. భారత్‌లోని చాలా మంది యువకులు ఇదే పరిస్థితిలో ఉన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నదనీ, ప్రపంచలోనే ఐదో ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టిన ఘనత తమదేనని మోడీ పలు సందర్భాల్లో చెప్తుంటారు. కానీ ప్రతి సంవత్సరం లేబర్‌ మార్కెట్‌లోకి ప్రవేశించే లక్షల మంది భారతీయ యువకులకు తగినంత ఉద్యోగాలు కల్పించటంలో మాత్రం విఫలమవుతున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.
గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం
భారత్‌లోని కాలేజీ గ్రాడ్యుయేట్‌లకు విద్య పూర్తయిన తర్వాత ఉద్యోగాలు లభించటం లేదు. నైపుణ్యాలు, అంచనాల భారీ అసమతుల్యత కూడా ఉన్నదని విశ్లేషకులు చెప్తున్నారు. వ్యవసాయం, నిర్మాణం వంటి రంగాలలో ఉద్యోగాలున్నా.. ఇవి కొత్తగా విద్యావంతులైన శ్రామికశక్తి డిమాండ్‌లకు అనుగుణంగా లేవని అంటున్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ (ఐహెచ్‌డీ), ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎల్‌ఓ) ఇటీవల విడుదల చేసిన ఇండియా ఎంప్లారుమెంట్‌ రిపోర్ట్‌ 2024 కూడా దేశంలోని ఉపాధి పరిస్థితుల గురించి భయంకరమైన వాస్తవాన్ని వెల్లడించింది. నిరుద్యోగ శ్రామికశక్తిలో భారత యువత దాదాపు 83 శాతం మందిని కలిగి ఉన్నారని వివరించింది. మొత్తం నిరుద్యోగ భారతీయులలో మాధ్యమిక లేదా ఉన్నత విద్య ఉన్న యువకుల వాటా 2000లో 35.2 శాతం నుంచి 2022 నాటికి 65.7 శాతానికి, అంటే దాదాపు రెండింతలు పెరిగిందని నివేదిక పేర్కొన్నది. భారత్‌లో యువత నిరుద్యోగ రేటు ఇప్పుడు ప్రపంచ స్థాయిల కంటే ఎక్కువగా ఉన్నాయని నివేదిక ఎత్తిచూపింది. ”భారత ఆర్థిక వ్యవస్థ కొత్త విద్యావంతులైన యువ శ్రామిక శక్తిలో ప్రవేశించిన వారికి వ్యవసాయేతర రంగాలలో తగినంత వేతనంతో కూడిన ఉద్యోగాలను సృష్టించలేకపోయింది. ఇది అధిక, పెరుగుతున్న నిరుద్యోగ రేటును ప్రతిబింబిస్తున్నది” అని ఐఎల్‌ఓ నివేదిక వివరించింది.
ఏప్రిల్‌ 19 నుంచి ఏడు దశల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు భారత్‌ సన్నద్ధమవుతున్నది. ఈ తరుణంలో యువత నిరుద్యోగ అంశం మోడీ ప్రభుత్వానికి పెద్ద సమస్యనే తీసుకొస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ”మోడీ పరిపాలన ఆర్థిక వ్యవస్థను తన ప్రచారంలో ప్రధాన అంశంగా మార్చుకుంది. కానీ, యువతకు ఉపాధి కల్పనను మాత్రం ప్రభుత్వం పట్టించుకోలేదు. నిరుద్యోగం అనేది బహుమితీయ సమస్య. వివిధ అంశాలలో విధానపరమైన చర్య అవసరం. ఇది తప్పనిసరిగా ఆర్థిక అంశం. కానీ దీనికి చాలా సామాజిక, రాజకీయ కోణాలు కూడా ఉన్నాయి”అని ఆర్థికవేత్త అరుణ్‌ కుమార్‌ తెలిపారు. ”గత మూడు దశాబ్దాలుగా విద్యావ్యాప్తితో, భారతీయ శ్రామికశక్తి ఎక్కువ విద్యావంతులు అయినప్పటికీ వారికి ఉద్యోగాలు పెరగలేదు. అందుకే చదువుకున్న యువతకు నిరుద్యోగం పెద్ద సమస్యగా మారింది’ అని ఆయన అన్నారు.
ఉద్యోగాల సంక్షోభం ముఖ్యంగా మహిళలను ప్రభావితం చేస్తున్నది. ఐఎల్‌ఓ నివేదిక ప్రకారం చదువుకున్న నిరుద్యోగ యువతలో, పురుషుల కంటే (62.2 శాతం) మహిళలు ఎక్కువ వాటా (76.7 శాతం) కలిగి ఉన్నారు. ప్రపంచంలోనే అత్యల్ప మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేట్లలో భారతదేశం కూడా ఒకటి. ఇది కేవలం 25 శాతమే కావటం గమనార్హం. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ సీనియర్‌ ఆర్థికవేత్త లేఖా చక్రవర్తి మాట్లాడుతూ.. భారతదేశంలో విద్యావంతులలో ముఖ్యంగా మహిళల్లో నిరుద్యోగం ఒక ముఖ్యమైన సమస్య అని అన్నారు.

Spread the love