చర్చ లేదు…ఓటింగ్‌ లేదు

– అరగంటలో మూడు బిల్లులు ఆమోదం
– ఇది రాజ్యాంగ, చట్ట విరుద్ధం : లోక్‌సభలో ప్రతిపక్షాలు
– ఉభయసభల్లో విపక్షాల ఆందోళన
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్‌లో నిమిషాల్లోనే బిల్లులు ఆమోదించారు. బిల్లులపై ఎటువంటి చర్చ , ఓటింగ్‌ లేకుండానే లోక్‌సభలో ప్రతిపక్షాల ఆందోళన మధ్యే మూడు బిల్లులను ఆమోదించారు. శుక్రవారం అరగంటలోనే ఈ బిల్లులు సభ ముందుకు తీసుకురావడం ఆమోదించుకోవడం జరిగిపోయింది. ఇది రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట విరుద్ధమనే ప్రతిపక్షాల విమర్శలు, ప్రతిపక్షాల ఆందోళనలతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది.లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనను చేపట్టాయి. ప్రతిపక్ష సభ్యులు ప్లకార్డులు చేబూని నినాదాలు హౌరెత్తించారు. కాంగ్రెస్‌ పక్షనేత అధిర్‌ రంజన్‌ చౌదరి మాట్లాడుతూ 1978 మే 10న పెట్టిన అవిశ్వాస తీర్మానంపై స్పీకర్‌ అనుమతించిన వెంటనే చర్చ జరిగిందని గుర్తు చేశారు. దీనికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి బదులిస్తూ అన్నీ నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని, పది రోజుల్లో అవిశ్వాసంపై ఎప్పుడైనా చర్చించవచ్చన్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షాల ఎంపీలు తమ నినాదాలను హౌరెత్తించడంతో సభ ప్రారంభమైన నాలుగు నిమిషాలకే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్ష ఎంపిలు ఆందోళన కొనసాగించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లును చర్చకు పెట్టారు. కేవలం ఇద్దరు (బీజేపీ, వైసీపీ) ఎంపీలు మాత్రమే మాట్లాడిన తరువాత, కేంద్ర మంత్రి సమాధానం ఇవ్వడం, బిల్లు ఆమోదించినట్టు ప్యానల్‌ స్పీకర్‌ రాజేంద్ర అగర్వాల్‌ ప్రకటించడం నిమిషాల్లోనే జరిగి పోయింది. అనంతరం కేంద్ర మంత్రి మనుసుఖ్‌ మాండవీయా నేషనల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ కమిషన్‌ బిల్లును, నేషనల్‌ డెంటల్‌ కమిషన్‌ బిల్లును వెంట వెంటనే చర్చకు పెట్టడం, ఆమోదించుకోవడం క్షణాల్లోనే జరిగింది. ఈ మూడు బిల్లులను మూజువాణి ఓటుతో ఆమోదించుకున్నారు. ఈ బిల్లుల ఆమోదంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఎటువంటి చర్చ, ఓటింగ్‌ లేకుండా రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట విరుద్ధంగా బిల్లులు ఆమోదించుకుంటున్నారని ధ్వజమెత్తాయి. అలాగే అవిశ్వాస తీర్మానం పెండింగ్‌లో ఉన్నప్పుడు, ఎటువంటి విధానపరమైన అంశాలు అనుమతించకూడదని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి.
రాజ్యసభలో…
రాజ్యసభలో అన్ని కార్యకలాపాలను వాయిదా వేసి, తాము లేవనెత్తిన అంశంపై చర్చించాలని కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐ, టీఎంసీ, ఎస్పీ, ఆప్‌, ఎన్సీపీ, డీఎంకే తదితర ప్రతిపక్ష పార్టీలకు చెందిన 47 మంది ఎంపిలు రూల్‌ 267 ప్రకారం నోటీసులు ఇచ్చారు. అయితే సభ ప్రారంభమైన వెంటనే ఇద్దరు సభ్యులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. పదవీ విరమణ చేస్తున్న బీజేపీ ఎంపీ వినరు దినుర్‌ టెండూల్కర్‌కు వీడ్కోలు పలికింది. అనంతరం రూల్‌ 267 ప్రకారం నోటీసులిచ్చిన ఎంపీల పేర్లను రాజ్యసభ చైర్మెన్‌ జగదీప్‌ ధన్కర్‌ చదివారు. సభ్యులు లేవనెత్తిన అంశంపై చర్చించేందుకు అంగీకారం తెలిపానని గుర్తు చేశారు. పార్టీలకతీతంగా స్వల్ప కాలిక చర్చలో పాల్గొనాలని కోరారు. వరుసగా ప్రతి సమావేశాల్లోనూ, ప్రతి రోజూ రూల్‌ 267 ప్రకారం అనేక నోటీసులు వస్తున్నాయన్నారు. గడచిన 23 ఏండ్లలో ఇలాంటి ఎన్ని నోటీసులకు అనుమతి లభించిందో ఈ సభకు తెలుసునని చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయం చాలా ముఖ్యమైనదని, ఎంపీలు ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడుగుతారని చెప్పారు. పార్లమెంటరీ కార్యకలాపాలకు ప్రశ్నోత్తరాల సమయం హృదయం వంటిదని తెలిపారు.
ధన్కర్‌ వర్సెస్‌ డెరిక్‌
డెరెక్‌ ఒబ్రెయిన్‌ స్పందిస్తూ, ”ఇదంతా మాకు తెలుసు” అన్నారు. ఈ సమావేశాలు ప్రాంభమైనప్పటి నుంచి మణిపూర్‌ సమస్య గురించి ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయని, దానిని చేపట్టాలని డిమాండ్‌ చేశారు. జగదీప్‌ ధన్కర్‌ ప్రతిస్పందిస్తూ ”దీని గురించి మీకు తెలుసునని నాకు తెలుసు. మీరు చెప్పనక్కర్లేదు. కేవలం వినండి చాలు. మీరు వింటే, మీకు అర్థమవుతుంది” అని అన్నారు. కానీ ఒబ్రెయిన్‌ వెనుకంజ వేయలేదు. అప్పుడు ఆయనను తన స్థానంలో కూర్చోవాలని ధన్కర్‌ కోరారు. ”మిస్టర్‌ డెరెక్‌ ఒబ్రెయిన్‌, నాటకీయ ప్రదర్శనలు చేయడం మీకు అలవాటుగా మారింది. ప్రతిసారీ మీరు లేచి నిలబడతారు. అది మీ విశేష అధికారంగా భావిస్తారు. సభాపతి స్థానాన్ని గౌరవించడం మీ కనీస కర్తవ్యం. నేను ఏం చెప్పినా, మీరు లేచి, నాటక ప్రదర్శనలు చేస్తారు” అని మండిపడ్డారు. చైర్మెన్‌ వ్యాఖ్యలపై స్పందించిన ఒబ్రెయిన్‌, ఆయన ముందు ఉన్న బల్లపై గట్టిగా కొడుతూ, తాను నిబంధనలకు అనుగుణంగానే ప్రవర్తిస్తున్నానని చెప్పారు. దీనికి ధన్కర్‌ స్పందిస్తూ ”బల్ల మీద కొట్టకండి. ఇది రంగస్థలం కాదు. మేం దీనిని సహించం, ఐయామ్‌ సారీ” అన్నారు. ఒబ్రెయిన్‌ ఏదో చెప్పబోతుండగా, ధన్కర్‌ సభను సోమవారానికి వాయిదా వేశారు. ”దీనిని మేం భరించలేం” అని అంటూ సభ నుంచి వెళ్లిపోయారు.
వచ్చే వారం ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లు
అత్యంత వివాదాస్పదమైన ఢిల్లీ సర్వీసెస్‌ బిల్లు వచ్చే వారం పార్లమెంట్‌కు రాబోతోంది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా మద్దతును కూడగట్టేందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రయత్నాలు చేశారు. ఈ బిల్లుకు మద్దతిస్తామని వైసీపీ ఇప్పటికే ప్రకటించగా, దీనిని వ్యతిరేకిస్తామని బీఆర్‌ఎస్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ బిల్లును వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెడతామని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్‌ రాజ్యసభలోనూ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ లోక్‌సభలోనూ శుక్రవారం తెలిపారు.

Spread the love