నేతన్నలను విస్మరిస్తున్న ప్రభుత్వాలు

నేతన్నలను విస్మరిస్తున్న ప్రభుత్వాలు– ఉపాధి కల్పించి ఆత్మహత్యలను నివారించాలి : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
– ప్రభుత్వం జనతా వస్త్ర పథకాన్ని ప్రవేశపెట్టాలి
– సంక్షోభం తీవ్రరూపం దాల్చక ముందే శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్‌
– నేత కార్మిక కుటుంబాలకు పరామర్శ
– బాధితులతో కలిసి అంబేద్కర్‌ చౌక్‌ వద్ద నిరసన
నవతెలంగాణ – సిరిసిల్ల టౌన్‌
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేతన్నలను విస్మరించడంతోనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయి, ఉపాధి లేక కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ అన్నారు. ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న ఐదుగురు నేత కార్మిక కుటుంబాలతో కలిసి తెలంగాణ పవర్‌ లూమ్‌ వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్‌ చౌక్‌ వద్ద శనివారం నిరసన వ్యక్తం చేశారు. కార్మికులకు ఉపాధి కల్పించి ఆత్మహత్యలను నివారించాలని, బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతోనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నాలుగు నెలల నుంచి సంక్షోభం ఏర్పడిందన్నారు. కార్మికులు పనులు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, ఐదుగురు కార్మికులు ప్రాణం తీసుకోవడం బాధాకరమని అన్నారు. పదేండ్లు పరిపాలనలో ఉన్న బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతన్నలను పట్టించుకోలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడంలో కాలయాపన చేస్తోందని అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో శవ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐదేండ్లు కరీంనగర్‌ పార్లమెంటు సభ్యునిగా ఉన్న బండి సంజరు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఏం చేశారని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించకపోగా దీక్ష చేస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. 15ఏండ్లు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్‌ నేతన్నల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపెట్టకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నేతన్నల సమస్యలపై ఏమీ పట్టనట్టు వ్యవహరించడం సరికాదన్నారు. ప్రభుత్వం జనతా వస్త్ర పథకాన్ని ప్రవేశపెట్టి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సమస్యలన్నీ పరిష్కరించి మరో ఆత్మహత్య జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 10శాతం యారన్‌ సబ్సిడీ రూ.18 కోట్లను వెంటనే అందించాలని, లేకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం తంగళ్ళపల్లి ఇందిరానగర్‌లో నేత కార్మికుడు అంకారపు మల్లేశం కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి దీప దాస్‌ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి మాట్లాడారు. నేత్తన్నల ఆత్మహత్యలు, ఉపాధి తదితర సమస్యలను పరిష్కరించాలని వారిని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్‌, పవర్‌లూమ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు మూశం రమేష్‌, జిల్లా అధ్యక్షులు కోడం రమణ, నాయకులు ఎలిగేటి రాజశేఖర్‌, అన్నల్దాస్‌ గణేష్‌, సూరం పద్మ, జవ్వాజి విమల, నక్క దేవదాస్‌, సిరిమల్ల సత్యం, కుడిక్యాల కనకయ్య, కూచన శంకర్‌, కంది మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Spread the love