కారుకు గుడ్‌ బై తప్పదా…!!

కారుకు గుడ్‌ బై తప్పదా...!!– ముహూర్తం ఫిక్స్‌.. 30న కాంగ్రెస్‌లోకి గుత్తా…?
నవతెలంగాణ-నల్లగొండటౌన్‌
శాసనమండలి మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ను వీడనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆ పార్టీపైన, కేసీఆర్‌పైన ఆయన చేసిన వ్యాఖ్యలు అందుకు బలం చేకూర్చుతున్నాయి. కొడుక్కు టికెట్‌ రాకపోవడం.. తనయుడి రాజకీయ భవిష్యత్‌ కోసం పార్టీ మారనున్నట్టు తెలుస్తోంది. కొన్నాళ్లుగా మాజీ సీఎం కేసీఆర్‌ పట్ల గుత్తా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే కేసీఆర్‌ కోటరీ వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినట్టు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. తనకు కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌లో అంతర్గత సమస్యలు, నేతల సహాయ నిరాకరణతోనే తన కొడుకు అమిత్‌ రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నట్టు చెప్పారు. మరోవైపు కొడుకు అమిత్‌ రెడ్డి వరంగల్‌ నేత, రేవంత్‌ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్‌ రెడ్డితో భేటీ అయిన విషయం కేసీఆర్‌్‌ దృష్టికి వెళ్లినట్టు సమాచారం. అప్పటినుంచి గుత్తాను కేసీఆర్‌్‌ పూర్తిగా దూరం పెట్టేశారని తెలిసింది. కొడుక్కి కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ వచ్చుంటే గుత్తా కూడా ఈపాటికే ఆ పార్టీలోకి వెళ్లిపోయేవారని బీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేసీఆర్‌ను ఉద్దేశించి సుఖేందర్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
30న కాంగ్రెస్‌లోకి గుత్తా…?
శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డితోపాటు మరి కొందరు ముఖ్య నేతలు బీఆర్‌ఎస్‌కు గుడ్‌ బారు చెప్పనున్నారు. వారంతా మంచి ముహూర్తం చూసుకొని కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. ఈనెల 30న హస్తం గూటికి చేరేందుకు ముహూర్తం ఫిక్స్‌ అయిందని సమాచారం. ఇప్పటికే ఆయనతో సన్నిహితంగా ఉండే ఎమ్మెల్సీలతో మంతనాలు జరిపి, అందరూ మూకుమ్మడిగా చేరే ప్లాన్‌ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారపర్వం కీలక దశకు చేరుకునే సమయంలో బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ కండువా కప్పుకొని ఆ పార్టీకి షాక్‌ ఇవ్వనున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. గుత్తాతో పాటు ఆయన తనయుడు అమిత్‌రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు, కీలక నేతలతో హస్తం గూటికి చేరనున్నారు. తనయుడి రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్‌ బాట పడుతున్నారనే చర్చ జరుగుతోంది. ఈనెల 30న సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం.

Spread the love