లోక్ సభ ఎన్నికలు.. ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్‌

నవతెలంగాణ – హైదరాబాద్‌: ఎన్నికల పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో.. ప్రయాణికుల రద్దీ పెరగడంతో హైదరాబాద్‌ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు టీఎస్‌ఆర్టీసీ పెద్దసంఖ్యలో ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఏపీకి ఇప్పటికే ప్రకటించిన బస్సుల్లో సీట్లన్నీ రిజర్వ్‌ అయిపోయాయి. దీంతో టీఎస్‌ఆర్టీసీ గురువారం అదనంగా మరో 160 సర్వీసులను ఆన్‌లైన్‌లో పెట్టింది. తెలంగాణ జిల్లాలకు వెయ్యికి పైచిలుకు బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈనెల 10, 11, 12 తేదీల్లో టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది.
టీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్‌ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు రోజూ 300 బస్సులు నడిపిస్తోంది. ఈ బస్సులన్నింట్లో రిజర్వేషన్లు అయిపోయాయి. ప్రత్యేక బస్సుల్లోనూ టికెట్లు వేగంగా రిజర్వు అవుతున్నాయి. ఈ నెల 10న 120, 11న 150, 12న 130 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. వీటిని విశాఖ, అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం, పోలవరం, కందుకూరు, కనిగిరి, ఉదయగిరి, ఒంగోలు వైపు ఎక్కువగా నడిపిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో 13, 14 తేదీల్లో ఏపీ నుంచి వచ్చేందుకు ఆర్టీసీ బస్సులను సిద్ధం చేస్తోంది.

Spread the love