నేవీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అడ్మిరల్‌ దినేష్‌ కె. త్రిపాఠి

నవతెలంగాణ – న్యూఢిల్లీ :    భారత నావికాదళం  26వ చీఫ్‌గా అడ్మిరల్‌ దినేష్‌ కె. త్రిపాఠి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. నేవీ చీఫ్‌గా 40 ఏళ్లకు పైగా సేవలందించిన అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ పదవీవిరమణ చేసిన సంగతి తెలిసిందే. సముద్ర ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు, ఎదురయ్యే ప్రతికూలతలను శాంతియుతంగా అరికట్టడానికి, కాని పక్షంలో యుద్ధాన్ని గెలవడానికి అవసరమైన కార్యాచరణతో నావికా దళం సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆత్మనిర్భర భారత్‌ దిశగా భారత నావికాదళం చేస్తున్న ప్రయత్నాలను బలోపేతం చేస్తానని, వికసిత్‌ భారత్‌ ద్వారా నూతన సాంకేతికతలు, వికసిత్‌ భారత్‌ కోసం నూతన అన్వేషణలతో నేవీని దేశ అభివృద్ధిలో మూలస్తంభంగా మార్చేలా చేస్తానని అన్నారు. నేవీలో మానవ వనరులను అంటే పురుషులు, మహిళల నైపుణ్యాలను పెంచేందుకు, వారికి అత్యుత్తమ ఆయుధాలు అందించేందుకు, శిక్షణ, వృత్తిపరమైన వాతావరణం, పరిపాలనాపరమైన మద్దతును అందించడానికి తాను ప్రాధాన్యతనిస్తానని అన్నారు.

Spread the love