తప్పుడు కేసులతో భర్తను వేధించడం క్రూరత్వమే : హైకోర్టు

నవతెలంగాణ – హైదరాబాద్: భర్త, అతని బంధువులపై లేనిపోని ఆరోపణలతో కేసులు నమోదు చేసి వేధించడంపై బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్‌ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. భర్తను భార్య ఇలా వేధించడం క్రూరత్వ చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కుటుంబ న్యాయస్థానం జారీ చేసిన విడాకులను రద్దు చేసి, దాంపత్య హక్కులను పునరుద్ధరించాలన్న ఓ మహిళ వినతిని తోసిపుచ్చుతూ న్యాయమూర్తి జస్టిస్‌ వై.జి.ఖొబ్రగడే ఈ విధంగా తీర్పు ఇచ్చారు. 2004లో వివాహమైన జంట 2012 వరకు కలిసి ఉండి ఆ తర్వాత తన పుట్టింటికి వెళ్లింది భార్య. అనంతరం ఆమె వేధింపుల ఆరోపణలతో భర్త, అతని తండ్రి, సోదరుడిపై పోలీసు కేసులు పెట్టారు. అయితే, న్యాయస్థానాలు వారిని నిర్దోషులుగా ప్రకటించాయి. తప్పుడు కేసులు పెట్టి మానసిక వేదనకు గురిచేసిన భార్యతో వైవాహిక బంధాన్ని ముగించుకోవడానికి అనుమతించాలంటూ భర్త కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. 2023లో విడాకులు మంజూరయ్యాయి. దీనిని సవాల్‌ చేస్తూ మాజీ భార్య హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా కోర్టు పై విధంగా తీర్పునిచ్చింది.

Spread the love