ప్రజాప్రతినిధుల కేసులపై.. హైకోర్టులను సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

నవతెలంగాణ న్యూఢిల్లీ: ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణలను త్వరగా పూర్తి చేసే కచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేయడం క్లిష్టమైన ప్రక్రియని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ప్రజా ప్రతినిధులపై నమోదైన క్రిమినల్‌ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ  పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.  ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన లేదా ప్రధాన న్యాయమూర్తి నియమించిన ధర్మాసనం ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేయాలని.. క్రిమినల్‌ కేసుల సత్వర విచారణకు అవసరమైన పర్యవేక్షణ కోరుతూ సుమోటో కేసులు నమోదు చేయాలని హైకోర్టులను సుప్రీం కోర్టు ఆదేశించింది. ట్రయల్‌ కోర్టులు అత్యవసరమైతే తప్ప ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసుల విచారణలు వాయిదా వేయకూడని ఆదేశాల్లో పేర్కొంది. కేసుల వివరాలను జిల్లా, ప్రత్యేక న్యాయస్థానాల నుంచి సేకరించి హైకోర్టు వెబ్‌సైట్‌లో ప్రత్యేక ట్యాబ్‌ ఏర్పాటు చేసి అందులో పొందుపరచాలని హైకోర్టులకు సూచించింది. ఇందుకు అవసరమై మౌలిక సదుపాయాలు, సాంకేతికతను జిల్లా న్యాయస్థానాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది.

Spread the love