ప్రేయసితో లాడ్జికి.. ప్రియుడి మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రియురాలితో కలిసి ఓయో లాడ్జీలో బస చేసిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన ఎస్సార్‌నగర్‌ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై శ్రావణ్‌కుమార్‌ వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లకు చెందిన హేమంత్‌ (28) ఇటుకల వ్యాపారం చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతి(27)తో ఏడేళ్ల కిందట పరిచయం ఏర్పడగా.. అది ప్రేమకు దారితీసింది. ఇద్దరూ కలిసి సోమవారం నగరంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై రాత్రి ఎస్సార్‌నగర్‌లోని ఓయో టౌన్‌హౌస్‌లో గది తీసుకొని బస చేశారు. మద్యం తాగి హేమంత్‌ రాత్రి 2 గంటల ప్రాంతంలో బాత్రూంకు వెళ్లాడు. ఎంతకు బయటకు రాకపోవడంతో యువతి చూడగా అపస్మారకస్థితిలో పడి కనిపించాడు. దీంతో యువతి హేమంత్‌ స్నేహితులకు చెప్పడంతో వారు వచ్చి హేమంత్‌ను మంచంపై పడుకోబెట్టి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్‌ సిబ్బంది పరీక్షించి అప్పటికే హేమంత్‌ మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న హేమంత్‌ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడి మృతిపై అనుమానాలున్నాయని దర్యాప్తు చేయాలని కోరారు.

Spread the love