భానుడి భగభగ.. వడగాల్పులకు ఎనిమిది మంది మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో భానుడి భగభగలతో ప్రజలు విలవిలలాడుతున్నారు. నిప్పుల కుంపటిని తలపిస్తున్న వాతావరణంతో అల్లాడుతున్నారు. ఈ ఏడాది మొదటిసారి 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వడగాల్పులకు ఎనిమిది మంది మృతిచెందారు. రోజురోజుకు పెరిగిన ఉష్ణోగ్రతలతో పగలు, రాత్రి వాతావరణం వేడిగా ఉంటోంది. జగిత్యాల, నల్గొండలో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు, కరీంనగర్‌ జిల్లా కొత్తగట్టులో 46, సిద్ధిపేట జిల్లా దూల్మిట్టలో 45.9, మంచిర్యాల జిల్లా జన్నారంలో 45.7, ములుగు జిల్లా మల్లూరులో 45.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత ఏడాదితో పోల్చితే ఈ సమయానికి కొన్ని ప్రాంతాల్లో..ఐదు నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. ఎండ వేడిమికి పెట్రోల్‌ బంకుల్లో.. అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న దుష్ప్రచారంతో.. జనం జంకుతున్నారు. మే నెలలో 48 నుంచి 49డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వారంపాటు వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Spread the love