చిన్నపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవు

– స్థిరాస్తులు కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి న్యాయమూర్తి కే.అనిత
నవ తెలంగాణ-నర్సాపూర్‌
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ చట్టాల పైన అవగాహన కలిగి ఉండాలని, ముఖ్యంగా చిన్నపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని న్యాయమూర్తి అనిత హెచ్చరించారు. శనివారం మండల్‌ లీగల్‌ సర్వీస్‌ కమిటీ ఆధ్వర్యంలో నర్సాపూర్‌ కోర్టులో విజ్ఞాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జడ్జి అనిత మాట్లాడుతూ స్థిరాస్తులను కొనుగోలు, అమ్మకాలు జరిపినప్పుడు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలన్నారు. తెల్ల కాగితాలపై స్థిరాస్తులు కొనుగోలు అమ్మకాలు జరప వద్దని రిజిస్ట్రేషన్‌ తప్పనిసరన్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలు పెంచుకొని దాంపత్య జీవితాలు నాశనం చేసుకోవద్దు అన్నారు, ఇటీవల తరచూ భార్యాభర్తల మధ్య గొడవతో తగు న్యాయం నిమిత్తం మండల్‌ లీగల్‌ సర్వీస్‌ కమిటీని ఆశ్రయిస్తున్నారు. కుటుంబపరమైన సమస్యలు ఏదైనా తలెత్తినప్పుడు సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకునే దిశగా ప్రయత్నాలు చేసి కలిసిమెలిసి ఉండాలి ఆమె గుర్తు చేశారు. అనంతరం లీగల్‌ సర్వీస్‌ బెంచ్‌ ద్వారా పలు పిఎల్‌సి కేసులను పరిశీలించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు స్వరూప రాణి, ఆర్‌. శ్రీనివాస్‌ రెడ్డి, సీనియర్‌ న్యాయవాది పుష్ప రాజ్‌ మండల్‌ లీగల్‌ సర్వీస్‌ కమిటీ సిబ్బంది, కోర్టు సిబ్బంది, కోర్ట్‌ పోలీస్‌ కానిస్టేబుల్స్‌, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love