మా వార్డుకు వస్తే అడ్డుకుంటాం

– బిఆర్‌ఎస్‌ నాయకులకు దళితులంటే ఎందుకు వివక్ష
– రాజనర్సు, కొండం సంపత్‌రెడ్డి వల్లే హరీశ్‌రావుకు మెజార్టీ తగ్గింది
– కాంగ్రెస్‌ నాయకులు సాకి ఆనంద్‌
నవ తెలంగాణ – సిద్దిపేట
కాంగ్రెస్‌ పార్టీ నుండి బిఆర్‌ఎస్‌ లో చేరిన తర్వాత మా వార్డుకు ఎమ్మెల్యే హరీశ్‌ రావు ఏమి చేశారో చెప్పాలని, దళిత వార్డులలో దళిత బంధు, డబ్బులు బెడ్‌ రూమ్‌ విషయంలో అన్యాయమే జరిగిందని, ఎంపీ ఎన్నికలలో తమ వార్డులో బిఆర్‌ఎస్‌ అభ్యర్థి, హరీశ్‌రావు ఎవరు తిరిగినా అడ్డుకుంటామని కాంగ్రెస్‌ నాయకులు సాకి ఆనంద్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కౌన్సిలర్‌ సాకి బాల లక్ష్మి తో కలిసి ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ నుండి కౌన్సిలర్‌ గా గెలిచిన తనను హరీశ్‌ రావు ఇంటికి వచ్చి కండువా కప్పి పార్టీలోకి తీసుకున్నారని, అప్పటినుండి తమ వార్డ్‌ కు అన్యాయమే జరిగిందని అందుకే తిరిగి సొంతగూటి కాంగ్రెస్‌ లోకి సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో చేరినట్లు తెలిపారు. గత కౌన్సిలర్‌ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ లో ఉన్న సాయి ప్రేమ్‌, సువర్ణ లక్ష్మి లు కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయమని ప్రచారం చేశారని, వారికి తమను విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు. గత మున్సిపల్‌ ఎన్నికల సమయంలో దళితులకు 100 డబుల్‌ బెడ్‌ రూములు ఇస్తామని చెప్పిన హరీశ్‌ రావు కేవలం 30 మాత్రమే ఇచ్చాడని, 100 శాతం దళితులు ఉన్న దళిత వార్డులలో నలుగురు ఐదుగురికి మాత్రమే దళిత బంధు ఇచ్చారని, అగ్రవర్ణ కౌన్సిలర్ల వార్డుల్లో మాత్రం ఎక్కువమందికి దళిత బంధు ఇచ్చారని అన్నారు. నెలకు లక్ష రూపాయల ప్రభుత్వ జీతం తీసుకుంటున్న వారి కుటుంబానికి కూడా దళిత బంధు ఇవ్వడం ఎంతవరకు న్యాయమన్నారు. హరీశ్‌ రావుకు స్థానికంగా ఉన్న నాయకులు కనపడలేదా, జనగామ నుండి వచ్చిన కొండం సంపత్‌ రెడ్డికి పార్టీ పట్టణ అధ్యక్ష పదవి ఇచ్చారని ప్రశ్నించారు. 1340 సర్వే నెంబర్‌ లో 58, 59 జీవోల కింద రెగ్యులరైజ్‌ చేసుకున్న వారి నుండి సంపత్‌ రెడ్డి డబ్బులు ఇవ్వందే మున్సిపల్‌ ఆఫీస్‌ నుండి ఇంటి నంబరు, విద్యుత్‌ శాఖ నుండి మీటర్‌ ఇవ్వకుండా అడ్డుకున్నాడని, తన సతీమణి కౌన్సిలర్‌ స్టాంపు ఉంటేనే ఇవ్వాలని చెప్పినట్లు ఆరోపించారు. తన బంధువుల స్థల విషయంలో కూడా తానే స్వయంగా డబ్బులు ఇచ్చినట్లు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా పట్టణంలో చైర్మన్‌ పదవిని అనుభవిస్తున్న రాజనర్సు పైన అవిశ్వాసం తీసుకురావాలని డిసెంబర్‌ 31న జరిగిన దావతులో అనుకున్నామని, హరీశ్‌ రావు దృష్టికి కూడా తీసుకు వెళ్లినట్లు తెలిపారు. పాత కలెక్టరేట్‌ భవనానికి కోటి రూపాయలు మంజూరు అయితే సంపత్‌ రెడ్డి, రాజనర్సుల మూలంగానే డబ్బులు రాకుండా పోయాయని ఆరోపించారు. ఆ విషయంలో దళితుల మధ్య కూడా చిచ్చుపెట్టే ప్రయత్నం వారు చేశారని ఆరోపించారు. గత కాంగ్రెస్‌ పాలనలో సిసి రోడ్లు పోయాలంటే కాంట్రాక్టర్‌ కౌన్సిలర్‌ సూచనల ప్రకారం కాలనీలో సీసీ పోసే వారిని, బిఆర్‌ఎస్‌ పాలనలో కాంట్రాక్టర్లను కౌన్సిలర్లు అడిగే పరిస్థితి చేరిందన్నారు. తాను కౌన్సిలర్‌ కాకముందే గీతారెడ్డి చేతుల మీదుగా 20 లక్షలతో ఒక భవనానికి, పోచమ్మ గుడికి 5 లక్షలతో అభివృద్ధి పనులు చేయించినట్లు తెలిపారు. పట్టణంలోని దళితుల భూములలోనే అనేక కార్యాలయాల భవనాలు నిర్మించారని, దళితులంటే ఎందుకు కక్ష అని అన్నారు. భవిష్యత్తులో తప్పనిసరిగా మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పై అవిశ్వాస తీర్మానం పెట్టి తన భార్య బాల్‌ లక్ష్మి ని చైర్మన్‌ చేయడానికి కృషి చేస్తానని, ఇతర కౌన్సిలర్లు కూడా తనకు సహకారం అందిస్తారని అన్నారు. హరీశ్‌ రావుకు మెజార్టీ తగ్గడానికి రాజనర్సు, సంపత్‌ రెడ్డిల పనితీరే కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు కొలను నరేష్‌, ప్రసాద్‌, రవి, యాదగిరి, మహేందర్‌ ,మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

Spread the love