బీజేపీది పితృస్వామ్య భావజాలం

– మాజీ క్రీడాకారిణి, సామాజిక ఉద్యమకారిణి జగ్మతి సంగ్వాన్‌
– అందుకే అత్యాచార నిందితులకు ఆ పార్టీ మద్దతు
– మహిళా రెజ్లర్లకు మోడీ సర్కార్‌ తీరని అన్యాయం
     ఉన్నావో ఉదంతం నుంచి బిస్కిస్‌ బానో వరకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కేంద్రంలోని నరెంద్ర మోడీ సర్కార్‌ అత్యాచార నిందితులకు మద్దతుగా నిలిచాయి. మహిళా రెజ్లర్ల విషయంలోనూ అదే జరిగింది. ఎందుకంటే బీజేపీది పితృస్వామ్య భావజాలం. బాధితులను మరింత క్షోభకు గురి చేయటం, నిందితులకు బాసటగా నిలువటం ఆ పార్టీ భావజాలంలోనే ఉందని భారత మాజీ వాలీబాల్‌ క్రీడాకారిణి, సామాజిక ఉద్యమకారిణి జగ్మతి సంగ్వాన్‌ అన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఆమెతో నవతెలంగాణ క్రీడా ప్రతినిధి శ్రీనివాస్‌ దాస్‌ మంతటి ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు..

మహిళా రెజ్లర్లు జనవరి నుంచి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఎందుకని ప్రభుత్వంలో కదలిక లేదు?
భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఓ మైనర్‌ సహా ఆరుగురు మహిళా రెజ్లర్లు బ్రిజ్‌భూషణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించి దేశం గర్వపడేలా చేసిన మహిళా రెజ్లర్లు ఓ వైపు.. 40కి పైగా క్రిమినల్‌ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న బ్రిజ్‌ భూషణ్‌ మరో వైపు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు, ఢిల్లీ పోలీసులు నిందితుడిని రక్షించేందుకు రంగంలోకి దిగాయి. సుప్రీంకోర్టు ఆదేశిస్తే గానీ బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. మోడీ సర్కార్‌ రాజకీయ ప్రయోజనాలు కాపాడుకునేందుకే ప్రయత్నించింది. బాధిత మహిళా రెజ్లర్లకు న్యాయం చేయాలనే ఆలోచన ప్రభుత్వంలో కనిపించలేదు. అందుకే, ఇప్పటికి బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ రెజ్లర్లపై ప్రత్యారోపణలు చేస్తూ బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు.
రెజ్లర్ల ఆందోళన అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించింది. భారత్‌లోనూ దేశవ్యాప్త ఉద్యమంగా రూపొందేలా కనిపించింది. అయినా బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను మోడీ సర్కార్‌ ఎందుకు కాపాడుతోంది?
బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ బలమైన రాజ్‌పుత్‌ సామాజిక వర్గానికి చెందినవారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ భాజపాకు అత్యంత కీలకం. మహిళా రెజ్లర్ల ఆరోపణలతో అతనిపై చర్యలు తీసుకుంటే ఊరుకోమని రాజ్‌పుత్‌ సంఘాలు బహిరంగ హెచ్చరికలు చేశాయి. బ్రిజ్‌భూషణ్‌కు అనుకూలంగా సభలు, ర్యాలీలు తీశారు. బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకుంటే ఉత్తరప్రదేశ్‌లో రానున్న ఎన్నికల్లో దెబ్బతింటామని భాజపా భావించింది. అందుకే, అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ఆసక్తి చూపించలేదు. మరోవైపు బ్రిజ్‌భూషణ్‌ సైతం భాజపా రహస్యాల చిట్టా విప్పేస్తానని హెచ్చరించారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసు నుంచి కాషాయ పార్టీలో కొనసాగుతున్న నాయకుడిని రక్షించేందుకు.. మహిళా రెజ్లర్లకు న్యాయం చేయాలనే ఆలోచనే మరిచారు.
అగ్రశ్రేణి అథ్లెట్లు లైంగిక వేధింపులకు గురైనా నిందితులపై చర్యలు లేవు. ఈ పరిణామంతో భవిష్యత్‌లో బాలికలు క్రీడలను కెరీర్‌గా ఎంచుకునేందుకు వెనుకడుగు వేయరా?
మహిళా రెజ్లర్ల అంశం ప్రభావం కచ్చితంగా ఉంటుంది. మన అమ్మాయిలు అంతర్జాతీయ వేదికపై విజయాలు సాధించినప్పుడు క్షేత్రస్థాయిలో యువతలో ఉత్సాహం అదే స్థాయిలో వెల్లువెత్తింది. ఇప్పుడు అదే అమ్మాయిలపై జరిగిన చీకటి కోణం సైతం ప్రతికూలంగా ప్రభావం చూపుతుంది. క్రీడల్లోకి అమ్మాయిలను పంపిస్తే.. వారి బాధ్యత, సంరక్షణ తల్లిదండ్రులదేనని ప్రభుత్వం పరోక్షంగా చెప్పేసింది. మహిళా రెజ్లర్లపై ఆగడాలకు పాల్పడిన వ్యక్తిని చట్టపరంగా శిక్షిస్తే.. భవిష్యత్‌లోనూ ఇలాంటి పనులకు పాల్పడాలనే ఆలోచనకు సైతం వణుకు పుట్టేది. కానీ భారతీయ జనతా పార్టీది పితృసామ్య భావజాలం. అత్యాచార బాధితులపై ఎదురు ప్రశ్నలు సంధిస్తూ మరింత క్షోభకు గురి చేయటమే భాజపాకు తెలుసు. మహిళా రెజ్లర్ల విషయంలోనే కాదు.. ఉన్నావో, బిల్కిస్‌ బానో కేసుల్లోనూ నిందితులకు బీజేపీ బాసటగా నిలిచింది. అత్యాచార నిందితులకు అండగా నిలువటమే ఆ పార్టీ సిద్దాంతం.
క్రీడా సంఘాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
పని చేసే చోట మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం ప్రకారం ప్రతి సంస్థలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉండాలి. భారత జాతీయ క్రీడా సమాఖ్యలో కొన్ని మాత్రమే ఈ కమిటీలను ఏర్పాటు చేశాయి. క్రీడా సంఘాల ఆఫీస్‌ బేరర్లలో మహిళలకు ప్రాతినిథ్యం లేకపోవటంతో పురుషులే ఈ కమిటీలో ఉంటున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని బదిలీ చేయటం, వార్షిక ఇంక్రిమెంట్‌ నిలుపుదల చేయటం మాత్రమే కమిటీ గరిష్టంగా తీసుకోగల చర్యలు. లైంగిక వేధింపుల నిరోధానికి ఈ కమిటీలకు ఉన్న అధికారం సరిపోదు. కమిటీలకు మరిన్ని అధికారాలు ఇవ్వాలి. ఇక బాధితులు కమిటీ ఎదుట నిర్భయంగా ఫిర్యాదు చేయగల పరిస్థితులు కల్పించాలి. బాధితులను ఫిర్యాదుల కమిటీనే మరింత వేధింపులకు గురి చేసిన సంఘటనలు సైతం ఉన్నాయి. భారత రెజ్లింగ్‌ సమాఖ్యలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ పేరును ‘లైంగిక వేధింపుల కమిటీ’గా పెట్టారు. అందుకు తగినట్టుగానే డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ వ్యవహరించినట్టు కనిపిస్తుంది!.
జంతర్‌మంతర్‌ వద్ద రెజ్లర్లకు మద్దతుగా ఆందోళనలో మీరూ పాల్గొన్నారు. ఆ సమయంలో రెజ్లర్ల భావోద్వేగాలు ఎలా ఉన్నాయి?
ఒలింపిక్స్‌, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పతకాలు సాధించిన మహిళా రెజ్లర్లు జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళనలో కూర్చున్నారు. మహిళా రెజ్లర్లు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చి నిరసన తెలపడానికి పడిన వేదనను నేను ఓ అథ్లెట్‌గా అర్థం చేసుకోగలను. ఢిల్లీ పోలీసులు రెజ్లర్లతో దారుణంగా వ్యవహరించారు. రోడ్డపైకి ఈడ్చుకొచ్చారు, లాఠీలకు పని చెప్పారు. రెజ్లర్లను నేరస్థులు, ఉగ్రవాదులను చూసినట్టు చూశారు. అధికార పార్టీ ఎంపీపై న్యాయ పోరాటం చేస్తే.. అగ్రశ్రేణి క్రీడాకారులనే విషయాన్ని సైతం పట్టించుకోకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టారు. నీటి సరఫరా నిలిపివేత, కరెంట్‌ నిలిపివేత, మద్దతుదారులను అడ్డుకోవటం వంటి దృశ్యాలు చూసిన మహిళా రెజ్లర్లు ఎంతో వేదనకు గురయ్యారు. మల్లయోధులు జంతర్‌మంతర్‌ వద్ద నిద్ర లేని రాత్రులు గడిపారు. మహిళా మల్లయోధల ఆవేదన మాటల్లో చెప్పలేనిది.
అథ్లెట్‌గా, సామాజిక ఉద్యమకారిణిగా హైదరాబాద్‌కు పలుమార్లు వచ్చారు. ఇక్కడ క్రీడాభివృద్ది, స్టేడియాలపై మీ అభిప్రాయం?
వాలీబాల్‌ క్రీడాకారిణిగా హైదరాబాద్‌తో మంచి అనుబంధం ఉంది. 1982 ఆసియా క్రీడల సన్నాహాక శిబిరం ఇక్కడి ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. ఆసియా క్రీడల కోసం ఇక్కడే సాధన చేశాం. లాల్‌ బహదూర్‌ శాస్త్రి స్టేడియంతో ఎంతో అనుబంధం ఉంది. కానీ ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో క్రీడా పోటీల కంటే ప్రయివేటు కార్యక్రమాలే ఎక్కువగా సాగుతున్నాయని విన్నాను. ఓ క్రీడాకారిణిగా ఇది ఏమాత్రం నచ్చలేదు. క్రీడాకారులు ఆడుకునేందుకు సైతం డబ్బులు చెల్లించి స్టేడియాలకు రావాల్సిన పరిస్థితిని ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. భారత జాతీయ జట్లకు ఎంతో మంది దిగ్గజ క్రీడాకారులను అందించిన చరిత్ర హైదరాబాద్‌కు ఉంది. క్రీడా మైదానాలను ఆటల పోటీలకు మాత్రమే ఉపయోగించాలి. రాజకీయ, ప్రయివేటు వేడుకలకు స్టేడియాలను ఉపయోగించకూడదు.

Spread the love