గోదావరి ముంపు కాలనీల్లో సీపీఐ(ఎం) పాదయాత్ర

– పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌తో భద్రాచలానికి పొంచి ఉన్న ప్రమాదం : ప్రారంభ సభలో వక్తల ఉద్ఘాటన
– పాదయాత్రను ప్రారంభించిన రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్‌
నవతెలంగాణ-భద్రాచలం
గోదావరి ముంపు నుంచి భద్రాచలం రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌తో భద్రాచలానికి ప్రమాదం పొంచి ఉందని సీపీఐ(ఎం) నేతలు అన్నారు. ముంపు కాలనీలలో సీపీఐ(ఎం) పాదయాత్రను శనివానం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్‌ ప్రారంభించారు. ప్రారంభ సభ భద్రాచలం ఏఎంసీ కాలనీలో శనివారం పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సభలో బండారు రవికుమార్‌, నియోజకవర్గ కో కన్వీనర్‌ కారం పుల్లయ్య ప్రసంగించారు. పోలవరం ముంపు నుంచి భద్రాచలానికి ప్రమాదం పొంచి ఉన్నదని తమ పార్టీ 2007లోనే హెచ్చరించినా పాలకవర్గాలు పెడచెవిన పెట్టాయని విమర్శించారు. గత సంవత్సరం వరదలు భద్రాచలం పట్టణ ప్రజలను భయాందోళనకు గురిచేశాయన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి సైతం వచ్చి భద్రాచలం రక్షణకు చర్యలు చేపడతామని మాటలు మాత్రమే చెప్పి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. భద్రాచలంలో గెలిచిన అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు ముంపు విషయంలో నోరు మెదపకపోవడం సరైనది కాదన్నారు. గతంలో సీపీఐ(ఎం) ప్రజాప్రతినిధులు వరదల సమయంలో ముంపు ప్రాంతాలను అంటిపెట్టుకొని ఉండి ప్రజలకు అండగా నిలిచారని, నేడు ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి భద్రాచలం ముంపు సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. తక్షణం గోదావరి కరకట్టకు మరమ్మతులు చేయాలని, కట్టకు ఉన్న స్లూఈజ్‌లు రిపేరు చేయించి సమర్థవంతమైన మోటార్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
మొదటిరోజు పాదయాత్ర భద్రాచలం ముంపు కాలనీలు ఏఎంసీ కాలనీ, అశోక్‌ నగర్‌ కొత్త కాలనీ, రెవెన్యూ కాలనీ, అయ్యప్ప కాలనీలలో కొనసాగింది. పాదయాత్రకు నియోజకవర్గ కో కన్వీనర్‌ కారం పుల్లయ్య సారథ్యం వహించగా.. బృందంలో పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, కార్యదర్శివర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, ఎం.రేణుక, సున్నం గంగా, బి.వెంకటరెడ్డి, బండారు శరత్‌ బాబు, వై.వెంకట రామారావు, పి సంతోష్‌ కుమార్‌, నాదెల్ల లీలావతి ఉన్నారు. ప్రారంభ సభలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, ఏ.జే. రమేష్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.బ్రహ్మచారి, ఎంబి నర్సారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్‌, దొడ్డ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love