గిరిజనేతరుల అరణ్యరోదన

– అడవితల్లి బిడ్డలపై సర్కారు వివక్ష గిరిజనేతరులమే కానీ అడవిబిడ్డలం కాదా?
– పోడు పట్టాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం
– రాష్ట్రంలో 4 లక్షల ఎకరాలకు గిరిజనేతరుల దరఖాస్తులు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఏడున్నర దశాబ్దాలకు పైగా అడవి తల్లి ఒడిలో కలిసిమెలిసి జీవిస్తున్న గిరిజన, గిరిజనేతరుల మధ్య పోడు పట్టాల విషయంలో సర్కారు అంతరాలు సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 12.46 లక్షల ఎకరాల పోడు భూముల కోసం అడవిబిడ్డలు దరఖాస్తు చేసుకోగా 1,50,012 మంది గిరిజన పోడు రైతులకు చెందిన 4,50,601 ఎకరాలకు మాత్రమే పోడు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సమాయత్తం అయింది. ఈనెల 30వ తేదీన ఆసిఫాబాద్‌ జిల్లా వేదికగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పట్టాలు అందజేస్తారు. కానీ ఈ పోడుపట్టాల విషయంలో గిరిజనేతరులను పరిగణలోకి తీసుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు 12 లక్షల ఎకరాల కోసం రైతులు దరఖాస్తు చేసుకుంటే కేవలం నాలుగున్నర లక్షల ఎకరాలతో సరిపెడుతుండటంతోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 4.36 లక్షల ఎకరాల పోడుభూములు 1.71 లక్షల గిరిజనేతరుల చేతుల్లో ఉన్నట్టు అటవీశాఖ అంచనా.
నిబంధనల సాకుతో..
రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల నుంచి 4,14,453 మంది 12,46,846 ఎకరాల పోడు భూముల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తొలుత 11 లక్షల ఎకరాలకు పైగా పట్టాలిస్తామన్న ప్రభుత్వం కేవలం 4,50,601 ఎకరాలకు మాత్రమే పోడు పట్టాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇక 1.71 లక్షల గిరిజనేతరులు 4.36 లక్షల ఎకరాల కోసం దరఖాస్తు చేసుకుంటే నిబంధనల సాకుతో వీరిలో ఒక్కరికి కూడా పట్టాలు ఇవ్వడం లేదు. షెడ్యూల్‌ ఏరియా భూ చట్టాలు అమల్లో ఉండటంతో వీరి భూములకు మోక్షం లభించడం లేదని అంటున్నారు. అటవీహక్కుల చట్టం 2006 ప్రకారం గిరిజనులు 2005 డిసెంబర్‌ 13వ తేదీ నాటికి అటవీ భూముల్లో సాగులో ఉండాలి. గిరిజనేతరులైతే మూడు తరాలుగా (75 ఏండ్ల్లు) అటవీ భూముల్లో పోడు చేస్తుండాలి. అంటే 1930 కంటే ముందు నుంచి అటవీప్రాంతంలో నివసిస్తున్నట్టు ఆధారం ఉండాలి. సంబంధిత ఆధారాలు పలువురు నాన్‌ట్రైబ్స్‌ వద్ద ఉన్నా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. 1951కి ముందు నిజాం పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రత్యేక పత్రాలు ఏమీ ఇవ్వలేదు.. అటువంటప్పుడు ఆధారాలు చూపించాలంటే ఎలా అని మరికొందరు గిరిజనేతరులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆక్రమణలో ఉన్న భూములకు, అందిన దరఖాస్తులకు పొంతన లేని కారణంగా గిరిజనేతరులను పక్కనపెట్టినట్టు మరో వాదన వినిపిస్తోంది. వచ్చిన దరఖాస్తుల్లో మూడో వంతు బోగస్‌వేనని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఐదేండ్ల క్రితం నాన్‌ట్రైబ్స్‌ సాగు చేస్తున్న భూములకు పహానీలు ఇచ్చినట్టే ఇచ్చి ఆ తర్వాత రద్దు చేశారు. ఆ పహానీలతో కొందరు పంట రుణాలు కూడా తీసుకున్నారు. వాటిని రద్దు చేయడంతో రుణాలు తీసుకున్న రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కనీసం ఆ భూములకైనా పట్టాలు ఇవ్వాలని గిరిజనేతరులు ఎప్పుటి నుంచో డిమాండ్‌ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. నాన్‌ట్రైబ్స్‌లో షెడ్యూల్‌ కులాలు, వెనుకబడిన వర్గాలకు చెందిన వారు కూడా అనేక మంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది పోడు వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నారు. పట్టాలొస్తాయని ఆశతో ఎదురుచూస్తున్న వీరికి నిరాశే మిగిలింది.
సీఎం పట్టాలిచ్చే ఆసిఫాబాద్‌ జిల్లాలో నాన్‌ట్రైబ్స్‌ దరఖాస్తులే ఎక్కువ..
ఈనెల 30వ తేదీన సీఎం కేసీఆర్‌ పోడు పట్టాలు పంపిణీ చేసే ఆసిఫాబాద్‌ జిల్లాలో గిరిజనుల కన్నా గిరిజనేతరుల నుంచే దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. ఈ జిల్లాలో 31,633 దరఖాస్తులు 76,800 ఎకరాల కోసం స్వీకరించారు. వీరిలో 15,600 మంది గిరిజనులుంటే 16,033 మంది గిరిజనేతరులు ఉండటం గమనార్హం. ఈ జిల్లాలోని 15 మండలాల్లో నాన్‌ట్రైబ్సే ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ఒక్క జైనూరు మండలంలోనే 40వేల ఎకరాల్లో నాన్‌ట్రైబ్స్‌ సాగు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో దరఖాస్తు చేసుకున్న వారిలో.. 11వేల గిరిజనులు, 15వేల మంది గిరిజనేతరులు ఉండటం గమనార్హం. రాష్ట్రంలోనే అత్యధికంగా పోడు పట్టాల అర్హులను గుర్తించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ 1930 కంటే ముందు నుంచే ఏజెన్సీలో నివసిస్తున్నట్టు పలువురు గిరిజనేతరుల వద్ద ఆధారాలు సైతం ఉన్నాయి. రాష్ట్రంలో ఆసిఫాబాద్‌ తర్వాత గిరిజనేతరుల సాగులో మహబూబాబాద్‌, ములుగు, కొత్తగూడెం, కామారెడ్డి, భూపాలపల్లి, ఆదిలాబాద్‌, ఖమ్మం, పెద్దపల్లి, జగిత్యాల, మెదక్‌, నిజామాబాద్‌, నాగర్‌కర్నూల్‌, నల్లగొండ, మంచిర్యాల, నిర్మల్‌, సిద్దిపేట, వనపర్తి తదితర జిల్లాల్లో గిరిజనేతరులు ఒక్కొక్కరి చేతిలో మూడు ఎకరాలకు పైగా ఉన్నాయని సమాచారం.
మూడు తరాలుగా సాగు చేస్తున్నాం
మూడు ఎకరాలు పోడుకొట్టుకుని మూడు తరాలుగా సాగు చేస్తున్నాం. పట్టా లేదు.. హక్కు పత్రం లేదు. మా భూమి మా ముత్తాత జీవనాధారంగా సాగు చేసిండు. తరువాత మా తాత, మా నాన్న, ఇప్పుడు నేను చేస్తున్నా. 1930కి ముందు నుంచి ఊర్లో ఉండి వ్యవసాయం చేస్తున్నాం. మొన్నటి పోడు సర్వేలో ఆ ఆధారాలు, మా గ్రామ పెద్దల వాంగ్మూలం కూడా ఇచ్చాను. పోడు పట్టాల కోసం ఆశగా చూసినా.. ప్రభుత్వ ప్రకటనతో కుటుంబం మొత్తం నిరాశకు గురయ్యాం.
చుంచు వెంకన్న, గిరిజనేతర రైతు, మొండికుంట, అశ్వాపురం, కొత్తగూడెం జిల్లా

Spread the love