గౌడ కులస్తుల ఆత్మగౌరవాన్ని పెంచుతాం

– మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, గంగుల కమలాకర్‌
– కోకాపేటలో గౌడ సంఘం భవనానికి శంకుస్థాపన
నవతెలంగాణ-గండిపేట్‌
గౌడ కులస్తుల ఆత్మగౌరవాన్ని పెంచుతామని రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, గంగుల కమలాకర్‌ అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా గండిపేట్‌ మండలం కోకాపేట్‌లో గౌడ సంఘం భవనానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ.. సర్దార్‌ సర్వాయి పాపన్న పేరుతో గౌడ సంఘ భవనాన్ని.. ఐదెకరాల స్థలంలో నిర్మిస్తున్నట్టు చెప్పారు. బీసీ వర్గాలకు అన్ని సంక్షేమ భవనాల మాదిరిగా గౌడ సంఘం భవనాన్ని కూడా గొప్పగా నిర్మిస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. కోకాపేట్‌లో అన్ని కుల సంఘాల భవనాలను నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. గౌడ కులస్తుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. ప్రజా సంక్షేమ భవనాలను త్వరలో పూర్తిచేసి కుల సంఘాలకు అంకితం చేస్తామన్నారు. బీసీలు ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటునిచ్చేందుకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అర్హులందరికీ దశల వారీగా రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌, శాసన మండలి మాజీ చైర్మెన్‌ కె.స్వామిగౌడ్‌, మాజీ ఎమ్మెల్సీలు గంగాధర్‌గౌడ్‌, భిక్షమయ్యగౌడ్‌, సత్యనారా యణగౌడ్‌, ఆంజనేయులుగౌడ్‌, బీసీ సంక్షేమ కార్పొరేషన్‌ చైర్మెన్‌ కృష్ణమో హన్‌రావు, బీసీ కమిషనర్‌ సభ్యులు కిషోర్‌గౌడ్‌, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, బీఆర్‌ఎస్‌ గండిపేట్‌ మండల అధ్యక్షులు రామేశ్వరం నర్సింహ, నార్సింగి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రేఖయాదగిరి, బీఆర్‌ఎస్‌ నాయకులు వెంకటేష్‌ యాదవ్‌, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, నాయకులు, పాల్గొన్నారు.

Spread the love