– బీసీ చేతివృత్తిదారుల దరఖాస్తులకు ఆహ్వానం.. వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి గంగుల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీసీ చేతివృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయంకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మంచిర్యాలలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించబోనున్నామని తెలిపారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సంబంధిత వెబ్‌సైట్‌ను మంత్రి ప్రారంభించారు. మంగళవారం నుంచి ఈ నెల 20వరకు https://tsobmmsbc.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫొటో, ఆధార్, కుల ధృవీకరణ పత్రం తదితర వివరాలతో సరళంగా అప్లికేషన్ ఫారాన్ని రూపొందించామని తెలిపారు. ధరఖాస్తులను జిల్లా యంత్రాంగం పరిశీలన తర్వాత లబ్దిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. చేతివృత్తిదారుల జీవితాల్లో వెలుగులు నింపి, వారికి ఆర్థిక భరోసాను అందించడంతో పాటు గౌరవప్రదమైన జీవనం కొనసాగించేందుకు ఈ సహాయం తోడ్పడుతుందని తెలిపారు. ఈ పథకం ద్వారా వారి జీవితాల్లో ఆర్థిక స్వావలంబనకు అవకాశం ఏర్పడుతుందన్నారు. లబ్దిదారులు వృత్తి పనిముట్లు, ముడిసరుకు కొనడానికి ఈ నిధులు ఉపయోగపడుతాయనీ, దీని ద్వారా లబ్దిదారులు ఆర్థిక స్వావలంబన సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ కార్పోరేషన్ ఎండీ మల్లయ్య భట్టు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.