బీజేపీ బీసీ డిక్లరేషన్‌ చిత్తుకాగితం

– సీఎం కేసీఆర్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కృతజ్ఞతలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కులవృత్తుల వారికి ఆర్థిక చేయూత ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించి, అమల్లోకి తెస్తున్నందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారంనాడిక్కడి బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కాలేరు వెంకటేష్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ బీసీ డిక్లరేషన్‌ పేరిట కొత్త నాటకానికి తెర లేపిందనీ, అది చిత్తు కాగితంతో సమానమని విమర్శించారు. బీసీల కోసం బీజేపీ ఎంపీలు పార్లమెంటులో ఎన్నడైనా మాట్లాడారా…అని ప్రశ్నించారు. తెలంగాణలో బీసీల కోసం అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు కావడం లేదో బీజేపీ ఎంపీ డాక్టర్‌ కే లక్ష్మణ్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆయన వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలవడం సిద్ధరామయ్య గొప్పతనం తప్ప, ఆ పార్టీది కాదన్నారు. తెలంగాణలో సిద్ధ రామయ్యలు లేరనీ, గాంధీభవన్‌లో గాడ్సేలు ఉన్నారని విమర్శించారు.

Spread the love