మహిళా రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేని బీజేపీ, కాంగ్రెస్‌

– కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మహిళా రిజర్వేషన్లపై బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చిత్తశుద్ధి లేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీ వేదికగా రిజర్వేషన్ల కోసం పోరాడిన కవితపై ఆ పార్టీల రాజకీయ విమర్శలు వారికి చిత్తశుద్ధి లేదని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు.
60 ఏండ్లు దేశాన్ని పాలించినా ఆ పార్టీలకు గిరిజనులు, మహిళల ప్రయోజనాల కోసం చట్టాలు చేయడం చేతకాలేదని విమర్శించారు. గిరిజనుల రిజర్వేషన్లు 10 శాతానికి పెంచి, 3,146 గిరిజన తండాలు, గోండు గూడాలు, చెంచు పెంటలను కొత్త గ్రామ పంచాయతీలుగా మార్చి గొప్ప నాయకులు కేసీఆర్‌ అని కొనియాడారు.
కిషన్‌ రెడ్డి, రేవంత్‌ రెడ్డి నోరు విప్పలేదు
గిరిజనులు, మహిళల కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి ఏనాడు పార్లమెంటులో పోరాడలేదని విమర్శించారు. మణిపూర్‌లో గిరిజనులు అల్లర్లకు అహుతులవుతుంటే కేంద్ర ఈశాన్య రాష్ట్రాల శాఖ మంత్రిగా ఉన్న కిషన్‌ రెడ్డి వారికి ధైర్యం చెప్ప కపోగా, తెలంగాణలో నీచ రాజకీయాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్లైనా గిరిజన విశ్వవిద్యా లయం ఏర్పాటు చేయని బీజేపీకి వారి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. 50 ఏండ్లు దేశాన్ని పాలించిన కాం గ్రెస్‌ పార్టీ మహిళలకు రిజర్వేషన్ల కల్పన చట్టాన్ని ఎందుకు చేయలేదో? రేవంత్‌ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. ప్రజల కోసం, రాష్ట్రం కోసం నిరంతరం పని చేస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులపై తప్పుడు కూతలు కూస్తున్న కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మరోసారి బుద్దిచెప్పడం ఖాయమని హెచ్చరించారు.

Spread the love