దళితబంధు విధివిధానాలు ప్రకటించండి

 Declare dalit bandhu rules– లబ్దిదారుల ఎంపిక బాధ్యత కలెక్టర్లకివ్వాలి : మండలిలో కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన దళితబంధు పథకం విధివిధానాలను ప్రకటించాలని కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండేలా కలెక్టర్లకు బాధ్యత అప్పగించాలని సూచించారు. శుక్రవారం శాసనమండలిలో ‘రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు సాధించిన ఫలితాలు’అనే అంశంపై లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితబంధు కోసం 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.17,700 కోట్లు కేటాయించినా, ఒక్క రూపాయి విడుదల కాలేదని విమర్శించారు. ఆ నిధులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కేటాయించారని గుర్తు చేశారు. లబ్దిదారులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఏ సంక్షేమ పథకానికి దరఖాస్తు చేయాలన్నా రేషన్‌ కార్డు తప్పనిసరి కావాలని చెప్పారు. కళ్యాణలక్ష్మి లబ్దిదారులందరికీ కొత్త రేషన్‌ కార్డులివ్వాలని అన్నారు. గతంలో బీసీ ప్రజాప్రతినిధుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బహిర్గతం చేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈ ఐదేండ్లలో బీసీ యాక్షన్‌ప్లాన్‌ ఏమీ లేదన్నారు. దరఖాస్తు చేసుకున్న బీసీలకు రూ.లక్ష సాయం అందించాలని చెప్పారు. గిరిజన బంధు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. నాలుగు లక్షల ఇండ్ల నిర్మాణానికి రూ.12 వేల కోట్లు కేటాయించినా ఒక్క రూపాయి విడుదల కాలేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను విడుదల చేయకపోవడంతో కాలేజీలు విద్యార్థులకు ధ్రువపత్రాలను ఇవ్వడం లేదని అన్నారు. దీనిపై బీఆర్‌ఎస్‌ సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి కల్పించుకుని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని వైఎస్‌ ప్రారంభించారని గుర్తు చేశారు. మొదటి ఏడాది సరిగ్గానే ఫీజు విడుదల చేశారనీ, ఆ తర్వాత సుప్రీంను ఆశ్రయించి ఫీజులు పొందామని వివరించారు. ఇప్పుడు విద్యార్థులకు సంబంధించిన స్కాలర్‌షిప్‌ ఆగడం లేదనీ, యాజమాన్యాలకు ఇచ్చే ఫీజు విడుదల ఆలస్యమవుతున్నదని చెప్పారు. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ఫీజు బకాయిలున్నాయనీ, వాటిని ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పూజారుల తరహాలో ఇమామ్‌, మౌజమ్‌లకూ గౌరవ వేతనం రూ.ఐదు వేల నుంచి రూ.పది వేలకు పెంచాలని కోరారు. ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏకు మార్చాలన్నారు. బీఆర్‌ఎస్‌ సభ్యులు ఎంఎస్‌ ప్రభాకర్‌రావు, ఎల్‌ రమణ, బస్వరాజు సారయ్య, వాణీదేవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు. ఎంఐఎం సభ్యులు మీర్జా రియాజుల్‌ హసన్‌ ఎఫెండి, మీర్జా రహమత్‌ బేగ్‌ మాట్లాడుతూ షాదీముబారక్‌ లబ్దిదారుల దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయని అన్నారు. అర్ములైన అందరికీ వర్తింపచేయాలని కోరారు.
ప్రీప్రైమరీ తరగతులను ప్రవేశపెడతాం : సత్యవతి రాథోడ్‌
ప్రీప్రైమరీ తరగతులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ చెప్పారు. అయితే ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశపెట్టాలా?, అంగన్‌వాడీల్లో ప్రవేశపెట్టాలా? అన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. అంగన్‌వాడీలో నమోదైన విద్యార్థులు ప్రాథమిక పాఠశాలల్లో చేరేంత వరకు ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ప్రీప్రైమరీ కోసం బ్రిడ్జీకోర్సును ప్రవేశపెడతామనీ, అంగన్‌వాడీ టీచర్‌ లేదంటే ప్రత్యేకంగా టీచర్‌ను నియమిస్తామని వివరించారు. అనాథ పిల్లల సంరక్షణ ప్రభుత్వ బాధ్యత అన్నారు. వారికి ఇంకో కుటుంబం దొరికే వరకు అండగా ఉంటామని చెప్పారు.
రూ.లక్ష సాయం బీసీ బంధు కాదు : గంగుల
రూ.లక్ష సాయం బీసీ బంధు కాదని ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. చేతివృత్తుల వారికి చేయూతనివ్వడం కోసమే రూ.లక్ష సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వచ్చే ప్రభుత్వం కూడా తమదేననీ, ఇది నిరంతరంగా కొనసాగుతుందని వివరించారు. 5.25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారనీ, వారిలో 4.11 లక్షల మంది అర్హులుగా ఉన్నారని చెప్పారు. రూ.400 కోట్లు విడుదల చేశామనీ, త్వరలోనే చెక్కులు పంపిణీ చేస్తామని అన్నారు. తర్వాత మళ్లీ దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. విద్యాప్రదాత కేసీఆర్‌ అని అన్నారు. కోకాపేటలో 41 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాల కోసం 87 ఎకరాలను కేటాయించారని చెప్పారు.
7 ఏండ్లు ఓపిక పడితే అందరికీ దళితబంధు : కొప్పుల
రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలున్నాయని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. అందరికీ ఒకేసారి వర్తింపచేయడం సాధ్యం కాదన్నారు. 65 ఏండ్లు ఇలాంటి పథకం లేకుండా ఉన్నారనీ, ఇంకో ఏడేండ్లు అయితే అందరికీ దళితబంధు అందుతుందని స్పష్టం చేశారు. సమాజంలో గౌరవంగా బతుకుతారని చెప్పారు. మూడెకరాల భూమి కొనుగోలుకు ప్రయత్నించినా భూమి అందుబాటులో లేదని అన్నారు. ఉన్నా రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు ధర ఉందన్నారు. ఇప్పటి వరకు రూ.7,600 కోట్లతో 6,998 కుటుంబాలకు 17,097 ఎకరాలను పంపిణీ చేశామని వివరించారు. మూడెకరాల భూమికి ప్రత్యామ్నాయంగానే దళితబంధును ప్రవేశపెట్టామని చెప్పారు.

Spread the love