ఎస్సీ కులాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి కొప్పుల

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎస్సీ కులాల అభ్యున్నతే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ అభివృద్ది శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ప్రతినిధుల బృందం శుక్రవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో మంత్రిని కలిశారు. రాష్ట్రంలో మాలలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు.
హైదరాబాద్‌ నగరంలో అన్ని కుల సంఘాల మాదిరిగా రూ.10 కోట్ల వ్యయంతో మాలాల భవనం నిర్మించాలని కోరారు. దళిత బంధు పథకం రెండో విడతలో 80 శాతాన్ని మాలలకు ఇవ్వాలని, గృహలక్ష్మి పధకాలంలోనూ అధిక సహాయం అందిస్తూ.. ఇళ్లు లేని నిరుపేద మాలాల కుటుంబాల వారికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ కులాల్లో వార్షిక ఆదాయ పరిమితిని రెండు లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచుతూ.. ప్రభుత్వం అంద చేస్తున్న మూడు ఎకరాల భూమిని ఐదు ఎకరాలకు పెంచాలని కోరారు. ప్రయివేటు విద్యా సంస్థల్లో పదో తరగతి లోపు ఎస్సీ విద్యార్థులకు ట్యూషన్‌ ఫీజు..రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్‌ ఓవర్సిస్‌ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసిన ప్రతీ ఒక్కరికి అవకాశం కల్పించాలని కోరారు. ఇవే అంశాలు పేర్కొంటూ మంత్రికి ఆ శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జాకు వారు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాల అనుబంధ కులాల సమాఖ్య మాజీ కో ఆర్డినేటర్‌ రావుల అంజయ్య, మాల మహానాడు (పీవి రావు) వ్యవస్థపాక అధ్యక్షులు చెరుకు రామ చందర్‌, వర్కింగ్‌ చైర్మెన్‌ తాళ్ల పల్లి రవి, తెలంగాణ మాల మ హానాడు అధ్యక్షులు నర్సిం హ, కార్యదర్శి రావుల విజ రు కుమార్‌ పాల్గొన్నారు.

Spread the love