స్పౌజ్‌ పాయింట్ల మీద చేస్తున్న ఆరోపణలు అవాస్తవం

– స్పౌజ్‌ టీచర్ల ఫోరం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
స్పౌజ్‌ పాయింట్ల మీద వస్తున్న ఆరోపణలు అవాస్తవమని స్పౌజ్‌ టీచర్ల ఫోరం ఖండించింది. ఈ మేరకు ఆ ఫోరం నాయకులు నందారం జైపాల్‌ రెడ్డి, నజియాబేగం, వారణాసి శివశంకర్‌, డి.సౌజన్య, రాథోడ్‌, నీరజ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత 13 ఏండ్లుగా 24 శాతం హెచ్‌ఆర్‌ఏ అనుభవిస్తున్న రంగారెడ్డి జిల్లాలోని ఐదు మండలాలు, సంగారెడ్డి జిల్లాలోని మూడు మండలాల పరిధిలోని కొందరు టీచర్లు ఇప్పుడు జరగబోయే బదిలీల నుంచి తప్పించుకోవడానికే కేసు వేశారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాలకు వారు చేస్తున్న ఆరోపణల ప్రకారం అధిక హెచ్‌ఆర్‌ఏ లేదు. రాజధానికి సమీప రంగారెడ్డి,సంగారెడ్డి జిల్లాల్లోని 8 మండలాల వారికి 24 శాతం హెచ్‌ఆర్‌ఏలో 13 ఏండ్లుగా ఉన్నందువల్లే బదిలీల్లో తక్కువ పాయింట్లు వచ్చాయని చెప్పారు..అలాంటివారు ఆ జిల్లా పరిధిలో కొంత దూరం వెళ్లడానికి ఇష్టపడక స్పౌజ్‌ పాయింట్ల నెపంతో బదిలీలు ఆగి పోవా లనే కుట్రతో కేసు వేశారని విమర్శిం చారు. దీనివలన ఆ రెండు జిల్లాల్లోని ఇతర మండలాల వారితో పాటు రాష్ట్రవ్యాప్తంగా 24 శాతం హెచ్‌ఆర్‌ఏతో సంబంధంలేని 30 జిల్లాల ఉపాధ్యాయులు బదిలీలు ,ప్రమోషన్లకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది ఉపాధ్యాయులు 40 పాయింట్లకు పైగా ఉండి బదిలీల కోసం ఎదురుచూస్తున్న వారికి ముఖ్యంగా పాఠశాలల్లో ఒకరు లేదా ఇద్దరు ఉన్న మహిళా టీచర్లు బదిలీలు ,ప్రమోషన్లు లేక తీవ్ర ఆవేదనతో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం కోర్టు దృష్టికి తెచ్చిన వివరణలో కూడా పిటిషనర్లు వాస్తవాలను సరైన దృక్పథంలో వివరించలేదని తెలియజేశారు. స్పౌజ్‌ పాయింట్లు అనేవి మహిళలు అవసరమైన సందర్భంలోనే అది కూడా ఎనిమిదేండ్లకు ఒక సారి మాత్రమే ఉపయోగించుకుంటారన్నారు. వాస్తవాల ను పరిశీలించి సత్వరమే స్టే ఎత్తివేసే విధంగా ప్రభుత్వ అధికా రులు చర్యలు తీసుకోవాలని కోరారు. బదిలీలకు, ప్రమో షన్లకు అర్హత పొందిన 80 వేల మంది ఉపాధ్యా యుల ప్రయోజనాలను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Spread the love