నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి కార్మికులకు మరింత వేగవంతమైన, మెరుగైన వైద్య సేవల కోసం నిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు ఆ సంస్థ డైరెక్టర్ ఎన్ బలరామ్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప తెలిపారు. శనివారంనాడిక్కడి ఆస్పత్రి ప్రాంగణంలో ఈ కౌంటర్లను వారు ప్రారంభించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ నిమ్స్‌లోని ఔట్ పేషెంట్, మిలీనియమ్, స్పెషాలిటీ బ్లాకుల్లో సింగరేణీయుల కోసం ఈ ప్రత్యేక ఔట్ పేషెంట్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రిఫర్ చేయబడిన సింగరేణి కార్మికులు, సీపీఆర్‌ఎంఎస్ మెడికల్ కార్డుల కలిగిన విశ్రాంత కార్మికులు అడ్మిషన్ కౌంటర్ల వద్ద ఇతరులతో కలిసి క్యూలైన్లలో ఎక్కువ సేపు వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా డాక్టర్లను సంప్రదించేందుకు, అడ్మిట్ అయ్యేం దుకు ఈ కౌంటర్లు పనిచేస్తాయన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వైద్య సేవలకు వస్తున్న కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలగ కూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇతర ఆస్పత్రు లతో పోల్చితే నిమ్స్‌లో తక్కువ ఖర్చు తో అన్ని రకాల వైద్య సేవలను విశేష ఆనుభవం గల వైద్య నిపుణులు అందిస్తున్నారని వివరించారు.
కార్య క్రమంలో సింగరేణి జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్) ఎమ్ సురేష్, డిప్యూటీ సీఎమ్‌ఓ డాక్టర్ బాలకోటయ్య, పీఆర్వో ఎస్ శ్రీకాంత్, డీఎమ్‌ఎస్‌లు డాక్టర్ కేవీ కష్ణారెడ్డి , డాక్టర్ లక్ష్మీభాస్కర్, ఆర్థిక విభాగం అధికారులు శ్రీధర్, వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్ మోహన్, పీఆర్వో శ్రీమతి లక్ష్మి, మీడియా రిలేషన్ ఆఫీసర్ సత్యాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.