సింగరేణి ఎన్నికల సమావేశం వద్ద సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికుల ధర్నా

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని డైరెక్టర్‌ (పా) హామీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సింగరేణిలో ఎన్నికల నిర్వహణ కోసం డిప్యూటీ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ (సెంట్రల్‌) కార్యాలయం హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన ఎన్నికల సమావేశం వద్ద సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికుల సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో సింగరేణి కాంటాక్ట్‌ కార్మికులు మూడు గంటల పాటు ధర్నా నిర్వహించారు.
కాంట్రాక్ట్‌ కార్మికులకు వేతనాలు పెంచాలనీ, 2022 సెప్టెంబర్‌ 26న చేసిన ఒప్పందాన్ని అమలు చేయాలనీ, కాంట్రాక్టు కార్మికులకు ఓటు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమావేశ నిర్వహణలో ఉన్న డిప్యూటీ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ (సెంట్రల్‌) కె. శ్రీనివాస్‌, సింగరేణి డైరెక్టర్‌ (పా) ఎన్‌. బలరాం కార్మికులను లోపలికి పిలిచి మాట్లాడారు. సమస్యలపై చర్చించారు. వారి వద్ద నుంచి వినతిపత్రం తీసుకున్నారు. ఒప్పందం లోని అన్ని అంశాలను అమలు చేస్తామనీ, ఈఎస్‌ఐ కోసం ఇప్పటికే ఈఎస్‌ఐ డైరెక్టర్‌కు లెటర్‌ రాశామనీ, త్వరలో ఈఎస్‌ఐ టీం విజిట్‌ చేస్తుందని తెలిపారు. నర్సరీ కార్మికులకు ఒప్పందం ప్రకారం వేతనాలు చెల్లిస్తామనీ, బోనస్‌ను కూడా ఫైనల్‌ చేస్తామని సింగరేణి డైరెక్టర్‌ (పా) హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఎస్‌సీఈయూ) ప్రధాన కార్యదర్శి మందా నరసింహారావు, సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికుల సంఘం (ఎస్‌సీకేఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కంపేటి రాజయ్య, ఎ. ఓదేలు, వి. కుమారి, సిహెచ్‌. అరవింద్‌, రాష్ట్ర నాయకులు, బానయ్య, సుధాకర్‌, సారయ్య, లక్ష్మి, శంకర్‌ స్వామి, సంపత్‌రెడ్డి, ప్రభాకర్‌, మహేందర్‌, సమ్మయ్య, శ్రీనివాస్‌, సంపత్‌, కళ, విజయలక్ష్మి, స్వరూప, సుగుణ, గణేష్‌, తిరుపతి, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love