ఆయిల్‌ ఫెడ్‌కు పొంచి ఉన్న ప్రయివేటీకరణ ప్రమాదం

– రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు
– కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలన వైఫల్యాలు రైతులకు శాపం : మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
– విజయం వంతంగా ముగిసిన ఆయిల్‌ పామ్‌ రాష్ట్ర సదస్సు
నవతెలంగాణ-అశ్వారావుపేట
టీఎస్‌ ఆయిల్‌ఫెడ్‌ (తెలంగాణ రాష్ట్ర నూనె గింజల ఉత్పత్తిదారుల సహాకార సమాఖ్య లిమిటెడ్‌)కు ప్రయివేట్‌ కంపెనీల రూపంలో ప్రయివేటీకరణ ప్రమాదం పొంచి ఉందని, ప్రభుత్వ రంగ సహకార సంస్థ అయిన ఆయిల్‌ఫెడ్‌ను ఆయిల్‌ ఫాం రైతులు సంఘటితంగా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత వచ్చిందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన రావు రైతులకు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణ కేంద్రంలోని సత్యసాయి కళ్యాణ మండపంలో మంగళవారం తెలంగాణ ఆయిల్‌పామ్‌ రైతు సంఘం రాష్ట్ర సదస్సును ఆ రాష్ట్ర కమిటీ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పోతినేని మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వం రంగ సంస్థలను దెబ్బ తీస్తూ ప్రయివేటీకరణ దిశగా పాలన సాగిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే భారత టెలికాం బీఎస్‌ఎన్‌ఎల్‌ను బలహీనం చేసి జియో, ఎయిర్‌టెల్‌ వంటి ప్రయివేటు సంస్థలు బలం పుంజుకునేలా చేసారని అన్నారు. ఆర్థిక రంగంలో ప్రయివేట్‌ బ్యాంకులను ప్రోత్సహించడం ద్వారా ఆంధ్రా బ్యాంక్‌ నిర్వీర్యం అయిందని, భారత బీమా సంస్థ ఎల్‌ఐసీని బలహీనం చేయడానికి ప్రయివేటు బీమా సంస్థలకు తాళాలు ఇస్తున్నారని ఆరోపించారు. రైతులు సంఘటితం కాకపోతే ఆయిల్‌ ఫెడ్‌కూ పై సంస్థల గతే పడుతుందని, ఇప్పటికే 21 ప్రయివేటు కంపెనీలకు ఆయిల్‌పామ్‌ సాగుకు పలు జిల్లాలు కేటాయించడం, రూ.13456 గిట్టుబాటు ధర పేరుతో కేంద్రంతో రాష్ట్రాలు ఒప్పందం చేసుకోవాలని ఒత్తిడి చేయడం లాంటి చర్యలు ప్రయివేటీకరణలో భాగమేనని హెచ్చరించారు. అందుకే అసంఘటిత ఆయిల్‌పామ్‌ సాగుదారులను ఐక్యం చేసి పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు.
సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడుతూ.. ఏటికేడు లక్షల ఎకరాల్లో విస్తరిస్తున్న ఆయిల్‌పామ్‌ సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను శాస్త్రీయ విధానంలో పరిష్కరించడం కోసమే ‘ఆయిల్‌ పామ్‌ రైతు సంఘం’ ఏర్పాటు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక సాగుయోగ్యత కలిగిన సారవంతమైన భూములు మన దేశంలోనే ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దివాళా కోరు పాలనతో మన రైతులు సాగు చేయలేక పోతున్నారని ఆరోపించారు. దేశంలో వంట నూనెల వాడకం 2.40కోట్ల టన్నులు ఉంటే.. 9 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేసుకుంటున్నామని, మిగతాది ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి రూ.80 వేలు కోట్లు వ్యయం చేస్తుందని తెలిపారు. దేశంలో 16 రాష్ట్రాల్లో 7 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగవుతుండగా ఏపీలో 3 లక్షల ఎకరాలు, తెలంగాణలో 92 వేల ఎకరాల్లో సాగు అవుతుందని తెలిపారు. తెలంగాణలో మరో రెండేండ్లల్లో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ విస్తరిస్తామని చెప్తున్నప్పటికీ ప్రకటనలకే పరిమితం అవుతుందన్నారు. ఆయిల్‌ ఫాం సాగు విస్తరించడానికి బడ్జెట్‌ కేటాయించినప్పటికీ ఆ నిధులను వేరే పద్దులకు మళ్ళిస్తున్నారని విమర్శించారు. ఆయిల్‌పామ్‌ సాగుదారుల సమస్యలు, గెలలకు గిట్టుబాటు, మద్దతు ధర రాబట్టడానికి సంఘం ఆధ్వర్యంలో కృషి చేస్తామని తెలిపారు. ఈ సదస్సులో ఉపాధ్యక్షులు కాసాని ఐలయ్య, అన్నవరపు కనకయ్య, మాదినేని రమేష్‌, మేక అశోక్‌ రెడ్డి, సహా కార్యదర్శి బొంతు రాంబాబు, జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, తుంబూరు మహేశ్వర రెడ్డి, తలశిల ప్రసాద్‌, శివరాం, చలపతిరావు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love