దాడి కారకులపై చర్యలు తీసుకోవాలి

తెలంగాణ సీఎంకు ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ లేఖ
న్యూఢిల్లీ : మహబూబాబాద్‌ పట్టణంలో ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుని నివాసముంటున్న పేదలు, మహిళలపై పోలీసులు లాఠీఛార్జీ, దాడి, గుడిసెలు కూలగొట్టడం, మంచినీళ్ల బావులను పూడ్చివేయడం లాంటి చర్యలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఏఐఏడబ్ల్యుయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు మంగళవారం లేఖ రాశారు. రియల్‌ ఎస్టేట్‌ మాఫియాతో కుమ్మక్కైన స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రిపై చర్య తీసుకోవాలని, అందుకు బాధ్యులైన పోలీసులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అలాగే పోలీసుల దాడికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను కూడా లేఖకు జత చేశారు. పేదల గుడిసెలకు పట్టాలిచ్చి డబుల్‌ బెడ్రూంలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. మూడు లక్షలతో పాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరో రూ. ఏడు లక్షలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర దశాబ్ద ఉత్సవాలను ఓ వైపు ఘనంగా నిర్వహిస్తుండగానే మరోవైపు మహబూబాబాద్‌ పట్టణంలో గత ఐదారు నెలలుగా ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలపై మంగళవారం ఉదయం పోలీసులు అత్యంత కిరాతకమైన, హేయమైన పద్ధతుల్లో లాఠీఛార్జీ చేశారన్నారు. మహిళలను చిత్రహింసలు పెట్టారని లేఖలో పేర్కొన్నారు. బందిపోట్ల దాడిని మరపించేట్లుగా వందల మంది పోలీసులు గుడిసెలపై దాడి చేశారని, అనేక మంది పేదలకు గాయాలయ్యాయని తెలిపారు. మహబూబాబాదు పట్టణం సర్వే నంబర్‌ 255లో 220 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉందని, గత కొంతకాలం క్రితమే 50 ఎకరాల భూమిని ఇదే సర్వే నంబర్‌లో పేదలకు అసైన్డ్‌ కూడా చేశారని గుర్తు చేశారు. ఇది ప్రభుత్వ భూమిగా రెవెన్యూ అధికారులు బోర్డులు కూడా పెట్టారని, అనేక సంవత్సరాల్లో ఈ భూమిని ఇండ్ల స్థలాలకు ఇవ్వాలని ప్రజలు ప్రభుత్వానికి అర్జీలు ఇచ్చారని పేర్కొన్నారు. అందుకు పోరాటాలు కూడా చేశారన్నారు. ఎన్నికల సందర్భాల్లో బీఆర్‌ఎస్‌ నాయకులు, అధికారులు పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి సానుకూలంగా ప్రకటనలు ఇచ్చారనీ, కానీ ఎంతకీ పరిష్కారం కాకపోవడంతో గత ఐదారు నెలలుగా భూమిలో గుడిసెలు వేసుకుని వేలాది కుటుంబాలు మండుటెండల్లో కాయకష్టం చేసుకుని నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని అన్నారు.రియల్‌ ఎస్టేట్‌ మాఫీయాకి ఎమ్మెల్యే, మంత్రి మద్దతు ఉండడం వల్లనే ఇప్పటికే మూడు, నాలుగు సార్లు పోలీసులు పేదల గుడిసెలను కూల్చివేశారని అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే దౌర్జన్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని పేర్కొన్నారు. దీనిపై మీ (ముఖ్యమంత్రి) స్పందన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, మీరు జోక్యం చేసుకుని దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Spread the love