రాజకీయాల్లోకి ట్రంప్ చిన్న కుమారుడు: 18 ఏండ్లకే

 

నవతెలంగాణ – మియామీ: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చిన్న కుమారుడు బ్యారన్‌ ట్రంప్‌ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. ‘రిపబ్లికన్‌ నేషనల్‌ కన్వెన్షన్‌’కు ఫ్లోరిడా నుంచి ప్రతినిధిగా పంపనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవన్‌ పవర్‌ బుధవారం తెలిపారు. నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున డొనాల్డ్‌ ట్రంప్‌ పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఆయన ఎంపికను అధికారికంగా ధ్రువీకరించేందుకు జులైలో పార్టీ కన్వెన్షన్‌ జరగనుంది. దీనికి ఫ్లోరిడా నుంచి 41 మంది ప్రతినిధులు వెళ్లనున్నారు. వారిలో బ్యారన్‌ ట్రంప్‌ ఒకరని పవర్‌ తెలిపారు. బ్యారన్‌ ట్రంప్‌ ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి దూరంగా ఉంటూ వచ్చాడు. మార్చిలో అతనికి 18 ఏళ్లు వచ్చాయి. వచ్చే వారమే హైస్కూల్‌ నుంచి గ్రాడ్యుయేట్‌ కానున్నాడు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌నకు కోర్టు అనుమతి ఇచ్చింది.

Spread the love