వచ్చే ఎన్నికల్లో నేను గెలవకపోతే రక్తపాతమే: డోనాల్డ్ ట్రంప్

నవతెలంగాణ – అమెరికా : రెండోసారి అమెరికా అధ్యక్షుడు కావాలనుకుంటున్న మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పీఠం కోసం జో బైడెన్‌తో పోటీకి సిద్ధమైయ్యారు. ఇందులో భాగంగా ప్రచారంలో ఆయన దూసుకెళ్తున్నారు. శనివారం ఓహియో రాష్ట్రంలోని వాండాలియాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నవంబర్ లో జరుగనున్న అధ్యక్ష ఎన్నికలు అమెరికా చరిత్రలో అత్యంత ముఖ్యమైనదిగా నిలిచిపోనుందని ట్రంప్ అన్నారు. అధ్యక్ష భవనం ‘వైట్‌హౌస్’లో అడుగుపెట్టేందుకు తాను సాగిస్తున్న ప్రచారం దేశానికి కీలకమైన మలుపుగా మారబోతోందని అన్నారు. ‘‘నవంబర్ 5వ తేదీని గుర్తుంచుకోండి. తన ప్రత్యర్థి అధ్యక్షుడు జో బైడెన్‌ను చెత్తగా ఆయన అభివర్ణించారు. వచ్చే ఎన్నికల్లో తాను గెలవకపోతే రక్తపాతమేనని ట్రంప్ హెచ్చరించారు. బైడెన్  విధానాల వల్ల అమెరికా వాహన పరిశ్రమలో ‘ఆర్థిక రక్తపాతం’ మొదలవుతుందనే కోణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు ట్రంప్ బృందం వివరించింది. మెక్సికోలో కార్లను తయారు చేసి వాటిని అమెరికన్లకు విక్రయించాలనుకుంటున్న చైనా ప్రణాళికలకు తాను ఆడుకుంటాను అని అన్నారు. ఎన్నికల్లో తాను గెలవకపోతే రక్తపాతం అవుతుందని, అయినప్పటికీ చైనా కార్లను అమెరికాలో అమ్మనివ్వనని అన్నారు. మరోవైపు ప్రస్తుతం జైల్లో ఉన్న తన మద్దతుదారులకు ట్రంప్‌ సానుభూతి ప్రకటించారు. కాగా రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ దాదాపు ఖరారయ్యారు. కీలక రాష్ట్రాల్లో ప్రైమరీ ఎన్నికల్లో గెలుపుతో నామినీగా ఆయనకు మార్గం సుగమమైంది.

 

Spread the love