యువకుడు మృతి.. డాక్టర్ కు రూ.1.27 కోట్లు జరిమానా

నవతెలంగాణ ఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూ నగరంలో ఓ డాక్టర్ చేసిన తప్పుడు శస్త్రచికిత్స వలన యువకుడు మృతి చెందాడు.  వినియోగదారుల ఫోరం ఆ వైద్యుడికి రూ.1.27 కోట్ల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే.. ఫతేపుర్‌కు చెందిన జ్ఞాన్‌దేవ్‌ శుక్లా కుమారుడు శివమ్‌ శుక్లా 2015లో కడుపునొప్పితో స్థానిక లోహియా ఆస్పత్రిలో చేరాడు. కిడ్నిలో రాళ్లు ఉన్నందున శస్త్రచికిత్స చేయాలని సూచించిన డాక్టర్‌ అరుణ్‌కుమార్‌.. లోహియా ఆస్పత్రిలో తగిన సౌకర్యం ఉన్నప్పటికీ ఓ ప్రయివేటు నర్సింగ్‌ హోమ్‌కు వెళ్లాలని సిఫార్సు చేశాడు. దాదాపు రూ.40 వేల వరకు వసూలుచేసి శివమ్‌కు ఆ నర్సింగ్‌ హోమ్‌లో డాక్టర్‌ అరుణ్‌ తప్పుడు ఆపరేషను చేశాడు. ఆ తర్వాత శివమ్‌ ఆరోగ్యం క్షీణించి మృతిచెందాడు. బాధితుడి తండ్రి జ్ఞాన్‌దేవ్‌ శుక్లా రాష్ట్ర వినియోగదారుల కమిషనులో ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపి జరిమానా విధించిన కమిషను 2015 జులై 20 నుంచి 12% వార్షిక వడ్డీతో కలిపి నెలరోజుల్లో చెల్లించాలని వైద్యుడికి గడువు విధించింది.

Spread the love