నవతెలంగాణ హైదరాబాద్: : మిగ్జామ్ తీవ్ర తుఫాన్ (Michaung Cyclone) బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. కాసేపట్లో తుఫాను తీరాన్ని దాటనుంది. ఇప్పటికే మిగ్జామ్ తుపాను ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిపిస్తుండటంతో చెన్నై నగరంతో పాటు.. తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఇప్పటికే వందల గ్రామాలు నీట మునిగాయి. రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. చెట్లు నేలకూలి.. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ సోమవారం రాత్రి నుంచి వర్షానికి తోడు బలమైన గాలుల తీవ్రత పెరిగిగాయి. దక్షిణ కోస్తా తీరం వెంబడి సాగుతున్న తుపాను.. మొత్తం 8 జిల్లాలపై ప్రభావం చూపనుంది. గంటకు గరిష్ఠంగా 110 కి.మీ. వేగంతో సుడిగాలులు సృష్టిస్తూ.. తీరాన్ని చుట్టేయనుంది. సోమవారం సాయంత్రం మిగ్‌జాం గంటకు 10 కి.మీ. వేగంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి కదులుతోంది. ఇదే వేగం ఉంటే.. నేటి మధ్యాహ్నం చీరాల, బాపట్ల సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
తీరంలో సోమవారం నుంచి అలలు 1.50 మీటర్ల నుంచి 2 మీటర్ల ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. తుపాను నేపథ్యంలో 8 జిల్లాల్లో 300 పునరావాస కేంద్రాల్ని ఏర్పాటు చేయాలని గుర్తించామని.. 181 ఇప్పటికే అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 10 కేంద్ర, రాష్ట్ర విపత్తు స్పందన దళాలను సిద్ధంగా ఉంచినట్టు తెలిపింది. తీరప్రాంత జిల్లాల్లో విద్యాసంస్థలకు నేడు కూడా సెలవులు ప్రకటించారు. తుఫాను ప్రభావంతో ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరిలో, విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లో సముద్రం కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని హెచ్చరించారు. ఇటు రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షాలు ఓ మోస్తారుగా కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు వర్షాలు కొనసాగనున్నాయి.