ప్రభుత్వాలు స్పందించకుంటే ఉద్యమం ఉధృతం

– పౌర సమాజం మద్దతివ్వాలి
– బీజేపీ విద్రోహంపై నిలదీయాలి : ‘పోలవరం నిర్వాసితుల పోరు కేక’ పాదయాత్ర ముగింపు ధర్నాలో వక్తలు
అమరావతి : పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు పోరు ఆగదని సీపీఐ(ఎం) ఏపీ ప్రకటించింది. పాదయాత్ర ప్రారంభం మాత్రమేనని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకుంటే పోరాటాన్ని ఉధృతం చేసి బుద్ధి చెపుతామని హెచ్చరించింది. నిర్వాసితుల ఆందోళనలకు పార్టీలు, సంఘాలు, యావత్‌ పౌర సమాజం మద్దతు తెలపాలని పిలుపునిచ్చింది. బీజేపీ విద్రోహంపై నిలదీయాలని విజ్ఞప్తి చేసింది. ప్రాజెక్టు ఆలస్యానికి కారకులెవరో ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేసింది. సీపీఐ(ఎం) ఏపీ చేపట్టిన ‘పోలవరం నిర్వాసితుల పోరు కేక’ పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయవాడలోని ధర్నాచౌక్‌లో మహా ధర్నా జరిగింది. సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం అధ్యక్షత వహించారు.
సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు ప్రసంగిస్తూ… అకుంఠిత దీక్షతో నిర్వాసితులు చేసిన పాదయాత్ర వృధా కాదు. వారి పట్టుదల, శ్రమ సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతాయి. జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రారంభ సమయంలో ఐదేళ్లల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి. 30 ఏండ్లయినా పూర్తి కాదన్నాం. 16 వేల కోట్లు కాదు 50 వేల కోట్లు కావాలన్నాం. అదే జరిగింది. ఆలస్యానికి కారకులెవరు? సర్వం త్యాగం చేసిన నిర్వాసితులా? జాతీయ ప్రాజెక్టు అన్న బీజేపీనా? బీజేపీ పంచన చేరి కాలక్షేపం చేసిన టీడీపీ కారణమా? బీజేపీ అడుగులకు మడుగులొత్తుతున్న వైసీపీనా? సమాధానం చెప్పాలి. నిర్వాసితులు కారణమని పాలకపార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ప్రాజెక్టులో ఎవరికి ముందు ప్రాధాన్య మివ్వాలి? భూములు, ఇండ్లు త్యాగం చేసిన లక్ష కుటుంబాలకు కాదా? వాళ్ల రక్తాన్ని, ప్రాణాలను, బతుకులను చిదిమేసి అభివృద్ధిని మనం ఆస్వాదిద్దామా? పోలవరం వలన అయ్యే సశ్యశ్యామలంలో నిర్వాసితులకు భాగస్వామ్యం వద్దా? నిర్వాసితుల సమస్య రాష్ట్రానిది, మనది, ప్రజలందరిది. సమాజమంతా అండగా నిలబడి వారికి మద్దతివ్వాలి. ఏం జరిగినా తలొంచుకొని పోతారులే అనుకుంటే తిరుగుబాటు చేస్తారు. అలాంటి తిరుగుబాట్లు కోరుకుందామా? కోరుకోకూడదు. ప్రభుత్వం బాధ్యతగా సమస్యలు పరిష్కరించాలి. ఈసారి వరదలొస్తే కొండలెక్కరు.ఏపీ సీఎం జగన్‌ ఇల్లెక్కుతారు. తాత్కాలిక చర్యలపై సర్కారు అఖిలపక్షం వేసి గిరిజన సంఘాలు, ప్రజాప్రతినిధులతో చర్చించాలి. కేంద్రం నిధులివ్వమంటే అప్పటి రేట్లు ఇప్పటి రేట్లనడానికి ఇదేమన్నా కూరగాయల బేరమా? ఎంతైతే అంతా ఇవ్వాలి. తొలిదశకు 12 వేల కోట్లని ఎన్నికల గిమ్మిక్కు చేస్తోంది బీజేపీ. తరచు ఢిల్లీ వెళుతున్న జగన్‌ ఎందుకు కేంద్రాన్ని నిధులు అడగట్లేదు. ఎందు కోసం మీ ములాఖత్‌లు, దండాలు దస్కాలు? సీఎంకు సిమెంట్‌, స్టీలు, ఇసుక మీద ప్రేమ. కమీషన్లొస్తాయని కాంట్రాక్టర్లపై ప్రేమ. మనుషులను పట్టించుకొనే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ప్రజలకు సమస్యొస్తే తీర్చాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. ఈమధ్య సీఎం తాను ప్రజల పక్షం అంటు న్నారు. ప్రజలపక్షమో కాంట్రాక్టర్ల పక్షమో తేల్చుకోవాలి. పాదయాత్ర ప్రభుత్వాలకు కంటి పరీక్ష. చూడకపోతే పోరాటం ఉధృతం చేసి ఎన్నికల్లో వారిని గద్దె దించుతారు.
పాలనను స్తంభింపజేస్తాం..
పోలవరం నిర్వాసితుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోతే ప్రతి గ్రామాన్నీ రణ క్షేత్రం చేస్తామని, పాలనను స్తంభింపజేస్తామని, సచివాలయాలను నడవనీయమని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు హెచ్చరించారు. పాదయాత్ర తరువాత పది పదిహేను రోజులు చూస్తాం. ప్రభుత్వం స్పందించకపోతే విశాల మద్దతుతో ఐక్య పోరాటాన్ని ఉధృతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తాం. పోరాటం చివరికంటా సాగుతుంది. ముందు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించమంటే ప్రభుత్వం ముందు డ్యామేనంటోంది. నిరుడు జులైలో వచ్చిన వరద నిర్వాసితులకు పీడకలగా మారింది. వరదంటే ఉలిక్కిపడుతున్నారు. ఈ వరదలు ప్రభుత్వ సృష్టి. నదికి అడ్డంగా కట్ట కట్టడం వలన వరదలొస్తున్నాయి. పాదయాత్రలో తెలియని నిర్వాసితుల బాధలు అనేకం తెలిసొచ్చాయి. పట్టాలు, మందులు, మంచినీళ్లు సైతం అందించకుండా నిరుడు వరద సహాయ చర్యలపై ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ యేడు కూడా ముందస్తుగా ఏమీ సిద్ధం చేయలేదు. ఈసారి వరదొస్తే తాడేపల్లి ప్యాలెస్‌ ఎక్కుతారు. అశాస్త్రీయ కాంటూరు లెక్కలతో మభ్యపెట్టి మోసం చేస్తోంది సర్కారు. నిరుడు వరదలకు మునిగిన అన్ని గ్రామాలనూ ముంపు గ్రామాలుగా ప్రకటించి ఆర్‌ అండ్‌ ఆర్‌ అమలు చేయాలి. సీఎం జగన్‌ ఎందుకు ఢిల్లీ వెళుతున్నారు. కేంద్రం కాళ్లు పట్టుకుంటారో కాలర్‌ పట్టుకుంటారో పోలవరం నిర్వాసితుల గురించి చర్చించి నిధులు తీసుకురండి. తీసుకురాలేకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వండి. లేదంటే మీ స్వంత ఆస్తులమ్మి ఇవ్వండి. చిన్న సమస్యలపై రీజాయిండర్లు, ఫ్యాక్ట్‌ చెక్‌ అనే మీరు పోలవరం నిర్వాసితులపై ఎందుకు సమాధానం చెప్పట్లేదు?…
మీ వెంటే రాష్ట్రం..
పోలవరం నిర్వాసితుల పోరాటం వెనుక ఈ రాష్ట్రం, కోట్లాది మంది ప్రజలు ఉన్నారని ఏపీ మాజీ మంత్రి, రైతు నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. మహాధర్నాకు ఆయన సంఘీభావం, పాదయాత్రికులకు అభినందనలు తెలియజేశారు. మీ ఆవేదనను, కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు కూడా ఇరిగేషన్‌ సదుపాయం కల్పించాలంటే పోలవరం అవసరం. అందుకే ప్రజలు బయటికి రాకపోయినా హృదయాంతరాల్లో నిర్వాసితులకు మద్దతిస్తున్నారు. మీకు వ్యతిరేకం చేస్తే ప్రభుత్వానికి బుద్ధి చెపుతారు. అమాయకులులే ఏం చేసినా ఊరుకుంటారనుకుంటే పొరపాటు. జార్ఖండ్‌లో మోడీ సర్కారు అదానీకి వేల ఎకరాలు కట్టబెట్టచూస్తే రైతులు ఎదు రుతిరిగారు. చివరికి ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పారు. నిర్వాసితుల సమస్య ఆషామాషీగా తీసుకుంటే ఇక్కడా అటు వంటి గుణపాఠం తప్పదు. ధర్నాలో ఇంకా ఇతర వామపక్ష పార్టీల నాయకులు, సంఘాల నేతలు ప్రసంగించారు. తొలుత ఆహ్వానితులను సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు స్వాగతం పలికారు.

Spread the love