– ప్రాధాన్యత లేని పద్దులకు మళ్లించిన రైల్వే శాఖ
– ప్రయాణికుల భద్రత గాలికి
– ఎత్తిచూపిన కాగ్
న్యూఢిల్లీ : రైల్వే ప్రయాణికుల భద్రత కోసం ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2017లో రాష్ట్రీయ రైల్ సంరక్ష కోశ్ (ఆర్‌ఆర్‌ఎస్‌కే) పేరిట ఏర్పాటుచేసిన ప్రత్యేక నిధి పక్కదారి పట్టింది. ఈ నిధిని రైల్వే శాఖ వేరే అవసరాల కోసం వినియోగించింది. మసాజ్ పరికరాలు, పాత్రలు, ఎలక్ట్రానిక్ సామగ్రి, శీతాకాలంలో ఉపయోగించే జాకెట్లు, ఫర్నీచర్, కంప్యూటర్లు, ఎస్కలేటర్ల కొనుగోలు కోసం ఆ నిధిని వాడుకుంది. అంతేకాదు… ఈ నిధి కింద కేటాయించిన సొమ్ముతో పూల తోటలు అభివృద్ధి చేశారు. మరుగుదొడ్లు నిర్మించారు. సిబ్బందికి జీతాలు, బోనస్‌లు చెల్లించారు. ప్రయాణికుల భద్రతను మాత్రం గాలికి వదిలేశారు. ఇది ప్రతిపక్ష పార్టీల ఆరోపణ కాదు. సాక్షాత్తూ గత సంవత్సరం డిసెంబర్‌లో కాగ్ ఇచ్చిన నివేదికలోని చేదు నిజాలు. నిధులను దారి మళ్లించడంలో రైల్వే శాఖ నిర్వాకాన్ని ఈ నివేదిక బహిర్గతం చేసింది.
2017-18 నుంచి 2020-21 మధ్యకాలంలో ఎంపిక చేసుకున్న నాలుగు నెలలకు సంబంధించి… 2017 డిసెంబర్, 2019 మార్చ్, 2019 సెప్టెంబర్, 2021 జనవరి…11,464 ఓచర్లను కాగ్ పరిశీలించింది. ప్రతి రైల్వే జోన్ నుంచి రెండు డివిజన్లను ఎంచుకొని ఈ పరిశీలన జరిపారు. భద్రతా నిధి కింద రూ.48.21 కోట్ల రూపాయల వ్యయానికి సంబంధించిన లెక్కలు సరిగా లేవని గుర్తించారు. ఈ నిధిని ప్రారంభించే సమయంలో అప్పటి రైల్వే మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ ప్రయాణికుల భద్రత కోసం ఐదు సంవత్సరాల కాలానికి లక్ష కోట్ల రూపాయల కార్పస్ ఫండ్‌ను కేటాయిస్తామని తెలిపారు. కేంద్రప్రభుత్వ పెట్టుబడితో పాటు రైల్వే శాఖ తన సొంత ఆదాయం, ఇతర వనరుల నుంచి మిగిలిన మొత్తాన్ని సమకూరుస్తుంది. ఈ నిధికి ప్రతి సంవత్సరం 20 వేల కోట్ల రూపాయలు జమ అవుతాయి. ఇందులో కేంద్రం పదిహేను వేల కోట్లు, రైల్వే శాఖ ఐదు వేల కోట్లు భరిస్తాయి.
అయితే గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ నిధికి అందజేసిన మొత్తం చాలా తక్కువగా ఉందని కాగ్ తేల్చింది. ఉదాహరణకు నాలుగేళ్లలో రైల్వే శాఖ ఇరవై వేల కోట్లు అందించాల్సి ఉండగా ఇచ్చింది కేవలం రూ.4,225 కోట్లు మాత్రమే. దీనిని బట్టి చూస్తే రూ.15,775 కోట్ల (78.9%) లోటు కన్పిస్తోంది. ప్రయాణికుల భద్రత కోసం అరకొర నిధులు కేటాయించడంతో పాటు అందించిన మొత్తాన్ని కూడా వేరే అవసరాల కోసం ఖర్చు చేశారు. జామాఖర్చులకు సంబంధించిన సమాచారాన్ని రైల్వే శాఖ ఏనాడూ ప్రజలకు బహిర్గతం చేయలేదు.రైల్వే అధికారులు ప్రాధాన్యత లేని అవసరాల కోసం నిధిని ఖర్చు చేశారని కాగ్ ఎత్తిచూపింది. 2017-18లో ప్రాధాన్యత లేని అవసరాల కోసం 2.76శాతం ఖర్చు చేస్తే 2019-20లో ఆ వ్యయం 6.36శాతానికి పెరిగింది. మరోలా చెప్పాలంటే ప్రాధాన్యేతర అవసరా ల కోసం అక్షరాలా రూ. 1,004 కోట్లు ఖర్చు చేశారు. ప్రాధాన్యత-1 పద్దు కింద ట్రాక్ పునరుద్ధరణ సహా సివిల్ ఇంజినీరింగ్ పనుల కోసం రూ.1,19,000 కోట్లు కేటాయించాల్సి ఉండగా లక్ష కోట్లు మాత్రమే కేటాయించారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ట్రాక్ పునరుద్ధరణ పనుల కోసం కేటాయింపులు క్రమేపీ తగ్గుతూ వస్తున్నాయి. 2018-19లో ఈ పనుల కోసం రూ.9,607.65 కోట్లు కేటాయించగా 2019-20లో కేటాయించింది రూ.7,417 కోట్లు మాత్రమే.