– రైలు భద్రతపై లేని పట్టింపు
– బడ్జెట్‌లో కోతలు.. వేలల్లో పోస్టుల ఖాళీలు
– చార్జీల పెంపుదల.. రైళ్ల ఆలస్యం
– సమస్యలతో ప్రయాణికుడు సతమతం
– పచ్చజెండాలు ఊపుతూ ప్రచారానికే మోడీ ప్రాధాన్యం
– కేంద్రం తీరుపై సామాన్య ప్రజలు, నెటిజన్ల నుంచి విమర్శలు
న్యూఢిల్లీ : ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదం కేంద్రంలోని మోడీ సర్కారు బాధ్యతా రాహిత్యాన్ని గుర్తు చేస్తున్నది. కేంద్రం వందే భారత్ రైలు సర్వీసులపై శ్రద్ధ పెట్టి.. రైలు భద్రతను గాలికొదిలేసిందని సామాన్య ప్రజలు, నెటిజన్లు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు రాష్ట్రాలకు వెళ్తూ.. వందే భారత్ రైళ్లకు పచ్చ జెండాలు ఊపి ప్రారంభిస్తూ కేవలం ప్రచారానికే మోడీ ప్రాధాన్యతనిచ్చారని విమర్శిస్తున్నారు. అసాధారణ రేట్లుండే ఈ రైళ్లతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఒరిగేదేముంటుందని ప్రశ్నిస్తున్నారు.
ఒడిశా రైలు ప్రమాదం ఘటనతో భద్రత గురించి మాత్రమే కాకుండా రైళ్లలో రద్దీ, జాప్యం, బడ్జెట్‌లో కోతలు, రైల్వేలో ఉద్యోగ ఖాళీలు, చార్జీల పెంపు వంటి ఇతర సమస్యలూ తెర మీదకు వస్తున్నాయి. ఎకనామిక్స్ టైమ్స్ ప్రకారం.. ప్రతి వందే భారత్ కోసం రైల్వే రూ. 115 కోట్లు వెచ్చిస్తున్న సమయంలోనే ఒడిశా రైలు ప్రమాదం చోటు చేసుకున్నది. వందే భారత్ విషయంలో అంతా తానే అన్నట్టుగా మోడీ వ్యవహరించారు. రైల్వే మంత్రికి కనీస ప్రాధాన్యతను ఇవ్వకపోవటం గమనార్హం.
పెరిగిన ప్రమాదాలు.. మరణాలు
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్‌బీ) సమాచారం ప్రకారం.. గత కొన్నేండ్లుగా రైల్వే ప్రమాదాలు పెరిగాయి. 2022-23లో ఈ ప్రమాదాలు 37 శాతం ఎగబాకాయి. రైలు ప్రమాద మృతుల సంఖ్య 2018లో 24,545, 2019లో 24,619గా ఉన్నది. కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న రైలు ప్రమాదాలు సుమారు 2.6 లక్షల మరణాలకు దారి తీశాయి. కోవిడ్ సమయంలో మినహా గత ఐదేండ్లలోనూ రైలు ప్రమాదాలు పెరిగాయి. భారత్‌లోని రైలు ప్రమాదాల్లో చోటు చేసుకున్న మరణాలు ఏటికేడు పెరుగుతున్నాయి.
నిధుల కోతలు.. కాగ్ హెచ్చరికలు
రైల్వేలకు కేటాయించే నిధులలోనూ మోడీ సర్కారు కోత విధిస్తున్నది. దీంతో ఈ నిధుల కత్తిరింపు రైల్వే భద్రతను దెబ్బతీస్తున్నాయి. 2017 నుంచి 2021 మధ్య రైలు ప్రమాదాలలో గణ నీయమైన భాగం ట్రాక్ లోపాల వంటి మెకానికల్ వైఫల్యాల కారణంగానే జరిగాయి. అయితే, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022-23 బడ్జెట్‌లో ట్రాక్ పునరుద్ధరణకు జరిపిన కేటాయింపులు రూ. 3,222.4 కోట్లు తగ్గటం గమనార్హం. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కూడా రైలు పట్టాలు తప్పినవాటిపై గతేడాది ఆడిట్(కాగ్ రిపోర్టు-2022) లో కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. 2017-18 నుంచి 2019-20 మధ్య కాలంలో కొన్ని రైల్వే జోన్‌లు కేటాయించిన నిధులలో కొంత భాగాన్ని తిరిగి ఇచ్చాయని కాగ్ హైలెట్ చేసింది. నిధుల కేటాయింపులో క్షీణత, కేటాయించిన నిధులను ఉపయోగించకపోవటం కారణంగా పున రుద్ధరణ పనులను సకాలంలో పూర్తి చేయటంపై ప్రభావం ఉంటుందని కాగ్ హెచ్చరించింది. 2017 -18 నుంచి 2020-21 వరకు 1129 పట్టాలు తప్పిన ఘటనల్లో 26 శాతం ట్రాక్ పునరుద్ధరణలతో ముడిపడి ఉన్నాయని వివరించింది. రైల్వే మంత్రిత్వ శాఖ నివేదిక- 2019-20 ప్రకారం రైలు ప్రమాదాలలో 70 శాతం పట్టాలు తప్పినవే. దీంతో ట్రాక్ పునరుద్ధరణ నిధులలో ఈ కోత ప్రస్తుతం చర్చకు దారి తీస్తున్నది. కోచ్‌లు పట్టాలు తప్పటం కారణంగానే శుక్రవారం నాటి ప్రమాదం చోటు చేసుకున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.
నియామకాల్లేవ్.. చార్జీల పెంపు.. రైళ్ల ఆలస్యం
నిధుల కోతతో పాటు నియామకాలు లేకపోవటం కూడా భద్రతను దెబ్బతీసింది. సెంట్రల్ జోన్‌లో ఖాళీగా ఉన్న 28,650 ఖాళీ స్థానాల్లో దాదాపు సగం భద్రతా కేటగిరికి చెందినవే. ఇటు చార్జీల పెంపు కూడా దారుణంగా ఉన్నది. ఇటీవల మరో 130 రైళ్లకు ‘సూపర్ ఫాస్ట్’ హోదా ఇవ్వటం వల్ల వాటి చార్జీలు పెరిగాయని ప్రయాణికులు ఫిర్యాదు చేశారు.
ఎక్కువ చార్జీలున్నప్పటికీ.. స్లీపర్ కోచ్‌లూ కిక్కిరిసిపోతున్నాయని సోషల్ మీడియా వేదికగా రైల్వే శాఖ మంత్రిని ట్యాగ్ చేస్తు పలువురు ప్రయాణికులు కంప్లైంట్‌లు చేశారు. ఒడిశాలో ప్రమాదానికి గురైన రైళ్లలో ఒకటైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ గురించి కూడా ఇలాంటివి చాలా ఫిర్యాదు లు ఉన్నాయి. ఇక రైలు ఆలస్యం ఇంకో సమస్య. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైల్వే స్వరూపం మారిపోయిందని రైల్వే మంత్రులు (ఎన్డీయే-1, ఎన్డీయే-2) పలు సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. అయితే, రైళ్లు మాత్రం చాలా ఆలస్యంగా నడుస్తున్నాయంటూ ప్రయాణీకుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావటం గమనార్హం.