– దీనికి వ్యతిరేకంగా పార్లమెంటులో ఓటేస్తాం
– క్రేజీవాల్ పోరాటానికి మా మద్దతు
– రాజ్యాంగ రక్షణకు ముందుకు రావాలని కాంగ్రెస్‌కు విజ్ఞప్తి
– సంయుక్త మీడియా సమావేశంలో సీతారాం ఏచూరి
– ఆర్డినెన్స్‌ను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం : కేజ్రీవాల్
– సీపీఐ(ఎం) నేతలను కలిసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బృందం
న్యూఢిల్లీ : ఢిల్లీలో పరిపాలనా సేవల నియంత్రణపై మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయంలో సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, ఎంఎ బేబి, బృందాకరత్, ఎ. విజయ రాఘవన్‌లతో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతీషి మర్లెనా, ఎంపీలు సంజరు సింగ్,రాఘవ్ చద్దాలతో కూడిన బృందం సమావేశమైంది. ఢిల్లీలో పరిపాలనా సేవల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్‌కు సీపీఐ(ఎం) తమ మద్దతు తెలిపింది. అనంతరం కేజ్రీవాల్‌తో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఏచూరి మాట్లాడారు. ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక అధికారాలను రద్దు చేసేందుకు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని తెలిపారు. ‘కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను మేం ఖండిస్తున్నాం. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇది కోర్టు ధిక్కారమే. కేంద్ర ప్రభుత్వం ఫెడరలిజంపై దాడి చేస్తున్నది. పార్టీలో అంతర్గత సమస్యలను పక్కనబెట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ముందుకు రావాలని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఏచూరి అన్నారు. ‘రాష్ట్రాల హక్కులపై అనేక దాడులు జరుగుతున్నాయి. ఆర్డినెన్స్ తీసుకురావడం ఒక దౌర్జన్య మార్గం. దీనికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బీజేపీయేతర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు మోడీ ప్రభుత్వం ఎంతకైనా తెగించవచ్చు’ అని ఏచూరి చెప్పారు.
ఇప్పటికైనా నిరంకుశ ప్రభుత్వాన్ని అడ్డుకోకపోతే ఫాసిస్టుగా తయారవుతారని కూడా ఏచూరి గుర్తుచేశారు. ప్రతిపక్ష ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఢిల్లీకి ఏం జరిగిందో రేపు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, వామపక్ష పాలిత కేరళ, ఇతర ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లోనూ జరగవచ్చని అన్నారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ మూల స్తంభాలపైన, దాని సమాఖ్య నిర్మాణంపైన దాడి చేస్తున్నదనీ ఆయన అన్నారు.
సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం : కేజ్రీవాల్
దేశ రాజధాని ప్రజలకు అండగా ఉంటానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని సీపీఐ(ఎం) నిర్ణయించిందని కేజ్రీవాల్ తెలిపారు. సీపీఐ(ఎం) మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఈ అంశంపై అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చి తమకు మద్దతు ఇస్తాయని ఆశిస్తున్నామన్నారు. రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేదని, ప్రతిపక్షాలు ఏకమైతే బిల్లు ఆమోదం పొందదని స్పష్టంచేశారు. తనను కలిసేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉన్నారా? అనేది సమస్య కాదనీ, ఇది ప్రజాస్వామ్య సమస్య అని కేజ్రీవాల్ అన్నారు. ‘కేజ్రీవాల్‌ను మర్చిపోవాలని, అయితే ఢిల్లీ ప్రజల పక్షాన నిలబడాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను, బీజేపీతో ఉంటారా? ఢిల్లీ ప్రజలతో ఉంటారా? వారు నిర్ణయించుకోవాలి’ అని తెలిపారు. ఈ విషయమై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌లను కలిశానని చెప్పారు. ఈ ఆర్డినెన్స్ తనకు మాత్రమే సంబంధించినది కాదని ఢిల్లీ ప్రజలకు, దేశం మొత్తానికి సంబంధించినదని కేజ్రీవాల్ తెలిపారు.