న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తున్నారు !

– ఎన్నికల కమిషన్‌ను నియంత్రించే చర్యలకు సీపీఐ(ఎం) ఖండన
న్యూఢిల్లీ : ఎన్నికల కమిషన్‌ను నియంత్రించేందుకు మోడీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. సుప్రీం కోర్టు తీర్పులను వ్యతిరేకించడం ద్వారా న్యాయ వ్యవస్థకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన స్వాతంత్య్రాన్ని మోడీ ప్రభుత్వం దెబ్బ తీస్తున్న తీరును పొలిట్‌బ్యూరో తన ప్రకటనలో తీవ్రంగా నిరసించింది. ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తిలతో కూడిన కమిటీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను, ఇతర ఎన్నికల కమిషనర్లను నియమించాలని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. తాజాగా మోడీ ప్రభుత్వం లోక్‌సభలో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. భారత ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ప్రధాని నియమించే కేంద్ర మంత్రిని తీసుకువచ్చింది. దీనివల్ల కార్యనిర్వాహక వర్గం మెజారిటీ అభిప్రాయమే అమలు చేయబడుతుంది. దీనివల్ల నిష్పాక్షితక, ఎన్నికల కమిషన్‌ స్వేచ్ఛా, స్వాతంత్యాలు నాశనమవుతాయి. ప్రభుత్వ ఒత్తిళ్లు, ప్రభావాలు లేకుండా స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు నిర్వహించేందుకు నిష్పాక్షికతతో వ్యవహరించే ఎన్నికల కమిషన్‌ వుండాలని భారత రాజ్యాంగం పేర్కొంటోంది. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలపై సుప్రీం కోర్టుకు చెందిన మరో రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వ్యతిరేకించిన వెంటనే ప్రభుత్వం ఈ చర్యను తీసుకుంది. ఈ తీర్పును రద్దు చేస్తూ మొదటగా మోడీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. ఆ తర్వాత పార్లమెంట్‌ ఆ చర్యను చట్టబద్ధం చేసింది. ప్రభుత్వ పరిధికి లోబడకుండా స్వతంత్రంగా వుండే విభాగాలను నియంత్రించేందుకు మోడీ ప్రభుత్వం చేపట్టిన చొరవలు పూర్తిగా హేయమైనవని పొలిట్‌బ్యూరో విమర్శించింది. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఈ బిల్లును సీపీఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ ప్రకటన పేర్కొంది. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు నిబద్ధతతో పనిచేసే పార్టీలన్నీ ముందుకు వచ్చి ఈ బిల్లును ఓడించాలని పొలిట్‌బ్యూరో పిలుపిచ్చింది.

Spread the love