ఆగని రెజ్లర్ల పోరాటం

 – పతకాలను గంగా నదిలో కలిపేందుకు యత్నం
– వారి పతకాలను తీసుకుని ఐదు రోజుల సమయం కోరిన రైతు నేత నరేశ్‌ టికాయత్‌
– ఇండియా గేట్‌ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు మల్లయోధుల వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలోని అగ్రశ్రేణి రెజ్లర్లు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. తమ పతకాలను మంగళవారం సాయంత్రం 6 గంటలకు హరిద్వార్‌లోని గంగానదిలో కలిపేందుకు ప్రయత్నించారు. రెజ్లర్లు వినేష్‌ ఫోగట్‌, సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పునియా, సంగీతా ఫోగట్‌ తదితరులు తమ మెడల్స్‌తో గంగానది వద్దకు చేరుకున్నారు. అంతకుముందు రెజ్లర్లు కన్నీరు మున్నీరయ్యారు. రెజ్లర్లు తమ పతకాలను పట్టుకుని నడుస్తూ భావోద్వేగానికి గురయ్యారు. రైతు నేత రాకేష్‌ టికాయిత్‌, నరేష్‌ టికాయిత్‌ తదితరులు అక్కడికి చేరుకున్నారు. నరేష్‌ టికాయిత్‌ జోక్యం చేసుకొని రెజ్లర్ల వద్ద మెడల్స్‌ను తీసుకొని, ఐదు రోజులు సమయం ఇవ్వాలని కోరారు. సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పునియా, వినేష్‌ ఫోగట్‌ విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో రెజ్లర్లు మంగళవారం సాయంత్రం 6 గంటలకు హరిద్వార్‌లోని గంగా నదిలో తమ పతకాలను నిమజ్జనం చేస్తారని చెప్పారు. ఈ పతకాలు తమ ప్రాణ మనీ, తమ ఆత్మ అని చెప్పారు. వీటిని గంగా నదిలోకి విసిరేసిన తర్వాత జీవించి ఉండటంలో అర్థం లేదన్నారు. వీటిని గంగా నదిలో కలిపిన తర్వాత తాము ఇండియా గేట్‌ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తమను ‘మా బిడ్డలు’ అని అంటూ ఉంటారనీ, కానీ ఆయన కూడా తమ పట్ల ఎటువంటి శ్రద్ధ చూపించడం లేదని ఆరోపించారు. తమను అణచివేస్తున్న బ్రిజ్‌ భూషణ్‌ను నూతన పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవానికి ఆహ్వానించారన్నారు. ఆయన తళతళ మెరిసే తెల్లని దుస్తుల్లో ఫొటోలకు ఫోజు లిచ్చారని మండిపడ్డారు. ఆ కాంతిలో తాము వెలిసిపోయామన్నారు.
మరోవైపు ఇండియా గేట్‌ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని రెజ్లర్లు హెచ్చరించారు. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇండియా గేట్‌ ‘జాతీయ స్మారక చిహ్నం. అది ప్రదర్శనలకు స్థలం కాదు’ కాబట్టి రెజ్లర్లు నిరసనకు అనుమతించబోమని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
రెజ్లర్లకు సీనియర్‌ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే మద్దతు
బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్న రెజ్లర్లకు సీనియర్‌ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే మద్దతు తెలిపారు. ’28న మన రెజ్లర్లు దాడికి గురికావడంతో ఏమి జరిగిందో విని విస్తుపోయాను. సరైన చర్చల ద్వారా దేన్నయినా పరిష్కరించుకోవచ్చు. వీలైనంత త్వరగా పరిష్కారం వస్తుందని ఆశిస్తున్నాం’ అన్నారు.
నిద్ర లేని రాత్రిని గడిపా: అభినవ్‌ బింద్రా
ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత అభినవ్‌ బింద్రా మాట్లాడుతూ ‘గత రాత్రి నిద్రలేదు. నా తోటి మల్లయోధుల నిరసనల భయానక చిత్రాలు వెంటాడాయి. మేము క్రీడా సంస్థల అంతటా స్వతంత్ర రక్షణ చర్యలను ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది’ అని పేర్కొన్నారు.
రేపు దేశవ్యాప్త ఆందోళనలకు ఎస్‌కేఎం, వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు
రెజ్లర్లకు మద్దతుగా రేపు (జూన్‌ 1న) దేశవ్యాప్త ఆందోళనలకు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం), వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిచ్చాయి. కాగా, రెజ్లర్ల పోరాటంపై అణిచివేతను తీవ్రంగా ఖండించాయి. జూన్‌ 1న దేశంలోని అన్ని జిల్లా, మండల కేంద్రాల వద్ద భారీ ప్రదర్శనలు, దిష్టిబొమ్మ దహనం చేయా లని పిలుపునిచ్చింది. జూన్‌ 5న అయోధ్యలో బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు మద్దతుగా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు, సన్యాసులు ర్యాలీ నిర్వహించనున్నారు. అదే రోజున గ్రామ, పట్టణ కేంద్రాల్లో బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ దిష్టి బొమ్మను దగ్ధం చేసి ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది.
జూన్‌ 1 నుంచి 3 వరకు ఆందోళనలకు మహిళ సంఘాల పిలుపు
రెజ్లర్లపై ఢిల్లీ పోలీసుల తీవ్ర దాడిని ఖండించిన మహిళ సంఘాలు జూన్‌ 1 నుంచి 3 వరకు దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపు ఇచ్చాయి. బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశాయి. మంగళవారం ఈ మేరకు ఐద్వాతో సహా 11 మహిళ సంఘాలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి.

Spread the love