మోడీ మౌనం బాధించింది

– క్రీడల మంత్రి మా సమస్యలను వినేందుకు ఆసక్తిగా లేరు
– చర్చించేందుకు వెళ్లినప్పుడు ఫోన్‌లో బిజీగా ఉన్నారు
15 రాత్రి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం : రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్‌
న్యూఢిల్లీ : రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ మాజీ చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ అంశంపై ప్రధాని మోడీ మౌనంగా ఉండటం తనను తీవ్రంగా బాధించిందని రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్‌ అన్నారు. బ్రిజ్‌ భూషణ్‌ను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. అందుకే అరెస్టు చేయలేకపోతున్నారని విమర్శించారు.
క్రీడా మంత్రి మొబైల్‌లో బిజీగా ఉన్నారు
ఆందోళన చేస్తున్న రెజ్లర్లను ఈ నెల 7న చర్చలకు ఆహ్వానించిన క్రీడా మంత్రి దృష్టి ఆ సమావేశంలో తమ వైపు లేదని వినేష్‌ చెప్పారు. తమ బాధలు వినకుండా మొబైల్‌తో బిజీ అయిపోయారనీ, ఆయన తమ ఫిర్యాదులను వినడానికి ఆసక్తి చూపలేదని తెలిపారు. ఈ నెల 15న కేసు ఛార్జిషీటును అందజేస్తామనీ, 30లోగా డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహిస్తామని అందులో హామీ ఇచ్చారని అన్నారు.
15 తర్వాత కీలక నిర్ణయం
క్రీడల మంత్రి ప్రకటన ప్రకారం ఇప్పుడు ఛార్జ్‌షీట్‌ కోసం ఎదురుచూస్తున్నామని వినేష్‌ ఫోగట్‌ తెలిపారు. ఆ తరువాత కూడా బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకోకపోతే ఆ రోజు రాత్రి (జూన్‌ 15) సమావేశం నిర్వహించి ఉద్యమాన్ని ప్రకటిస్తామన్నారు. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేసేందుకు ప్రభుత్వం అనుమతించకపోతే.. రాంలీలా మైదాన్‌లో, మరేదైనా ప్రాంతంలో ఆందోళన చేపడతామన్నారు. శిక్షణ శిబిరాలు, టోర్నమెంట్‌ల్లో బ్రిజ్‌ భూషణ్‌ యువ మహిళా రెజ్లర్లను ఒంటరిగా ఉన్నప్పుడు తాకడానికి సాధ్యమైన అన్ని మార్గాలను ఉపయోగించాడని వినేష్‌ ఫోగట్‌ ఆరోపించారు. ఇది మళ్లీ మళ్లీ జరిగేదని, కానీ భయంతో అందరూ మౌనంగా ఉండేవారని అన్నారు. మాజీ చీఫ్‌ సింగ్‌పై లైంగికంగా వేధింపుల కేసులో అంతర్జాతీయ రిఫరీ జగ్బీర్‌, ఫిజియోథెరపిస్ట్‌ నుంచి వాంగ్మూలం తీసుకున్న తరువాత ఇప్పుడు ఢిల్లీ పోలీసులు కజకిస్తాన్‌, మంగోలియా, ఇండోనేషియా నుంచి సహాయం కోరారు. సింగ్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన ప్రదేశాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు, ఫోటోలను అందించాలని రెజ్లింగ్‌ సంఘాలకు నోటీసులు పంపారు.

Spread the love